Latest Videos

చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య పంచాయితీ తప్పదా..?

By Arun Kumar PFirst Published Jul 4, 2024, 7:52 PM IST
Highlights

ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సత్సంబంధాలున్నాాయి. అయితేే రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో ఈ సత్సంబంధాలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి..  

Nara Chandrababu vs Revanth Reddy : 2014 వరకు ఉమ్మడిగా వున్న ఆంధ్ర ప్రదేశ్ ఆ తర్వాత రెండుగా విడిపోయింది... తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించగా... రాయలసీమ, కోసాంధ్ర ప్రాంతాలతో మరో రాష్ట్రం అలాగే మిగిలిపోయింది. దీంతో దశాబ్దాలుగా కలిసున్న తెలుగువాళ్ళు విడిపోయారు... ఒక్కటిగా సాగిన పాలన వేరువేరుగా మారింది. ఇలా ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచింది... కానీ ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు అలాగే వున్నాయి. ఆస్తులు, అప్పుల పంపకంతో పాటు నదీజలాల వాటాలోనూ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణమే వుంది. 

అయితే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వుంది. ఏపీకి చంద్రబాబు నాయుడు, తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా వున్నారు. ఒకప్పుడూ వీరిద్దరూ ఒకే పార్టీ నాయకులు... రేవంత్ కు రాజకీయ గురువుగా చంద్రబాబును పేర్కొంటారు. ప్రస్తుతం పార్టీలు వేరువేరయినా చంద్రబాబు, రేవంత్ మధ్య అనుబంధం అలాగే వుందనేది అందరికీ తెలిసిన విషయమే. వీరి సత్సంబంధాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇదే మంచి సమయమని అందరూ భావిస్తున్నారు. ఆ దిశగా ఇరువురు నేతలు కూడా చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య  ఏర్పడిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చంద్రబాబు, రేవంత్ ముందుకొచ్చారు. జూలై 6న అంటే వచ్చే శనివారం హైదరాబాద్ లో తెలుగురాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఇద్దరూ ఒకే వేదికపై ముఖాముఖి చర్చల ద్వారా సమస్యల పరిష్కారినికి ప్రయత్నించనున్నారు. ఇలా ఇద్దరు సీఎంల భేటీపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.... ఏ సమస్యలకు పరిష్కారం లభిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. 

అంత ఈజీ కాదు : 

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం అంత ఈజీ కాదు. ఇద్దరు సీఎంల మధ్య ఎంతమంచి సంబంధాలున్నా తమ రాష్ట్ర ప్రయోజనాలే వారి మొదట ప్రాధాన్యత. కాబట్టి ఓ దశవరకు ఇద్దరు సీఎంలు పట్టువిడుపు చూపించవచ్చు... కానీ కొన్ని జటిలమైన సమస్యల విషయంలో ఇద్దరి మధ్యా పంచాయితీ తప్పదు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు, రేవంత్ ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు దేశ రాజధాని డిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విభజన హామీలు, ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అంతేకాదు జూన్ 6న జరిగే ఇద్దరు సీఎంల భేటీ గురించి కూడా వారికి తెలిపారు. 

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి వద్ద పోలవరం ప్రాజెక్ట్ కోసం  తెలంగాణ నుండి ఏపీలో కలిపిన గ్రామాలగురించి ప్రస్తావించడం ఆసక్తికర అంశం. గతంలో ఏపీలో విలీనంచేసిన ఐదు గ్రామాలను  తిరిగి తెలంగాణలో కలపాలని ప్రధాని,హోంమంత్రులను కోరినట్లు  సీఎంతో పాటే వీరిని కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 

మరోవైపు ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన నారా  చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే పట్టుదలతో వున్నారు. ఇందుకోసం కేంద్ర సహకారం కోరుతున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లతో భేటీ సమయంలోనూ పోలవరం ప్రాజెక్ట్ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఇలా పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు సర్కార్ సీరియస్ గా వుంది. 

పోలవరంపై పంచాయితీ తప్పదా..? 

ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశాన్ని బట్టి ఓ విషయం అర్థమవుతోంది... పోలవరం విషయంలో వీరిమధ్య పంచాయితీ తప్పదని. ఇప్పటికే చంద్రబాబు, రేవంత్ ల భేటీ ఖరారయ్యింది... ఇలాంటి సమయంలో పోలవరం గ్రామాల ప్రస్తావన ప్రధాని వద్ద తీసుకొచ్చారు. అంటే శనివారం జరిగే భేటీలోనూ ఈ ప్రస్తావన చర్చకు వచ్చే అవకాశం వుంది. అయితే ఈ గ్రామాలను వదులుకునేందుకు చంద్రబాబు సిద్దమా..? అంటే కాదనే సమాధానమే వినిపిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈ గ్రామాలు కీలకం కాబట్టే గతంలో కేంద్రాన్ని ఒప్పించి వీటిని ఏపీలో కలుపుకున్నారు... అలాంటిది ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణం కీలకదశలో వుండగా ఆ గ్రామాలను వదులుకునే ప్రసక్తే వుండదు. కాబట్టి  ఈ గ్రామాల విషయంలో గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య పంచాయితీ తప్పేలా లేదు. 

గతంలో ఇలాగే కేసీఆర్, వైఎస్ జగన్ లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వుండగా విభజన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు. పంచాయితీ కోసం కేంద్ర వద్దకు కూడా వెళ్లారు. వీరిద్దరి మద్య కూడా మంచి సంబంధాలే వుండేవి. అయినా విభజన సమస్యలు పరిష్కారం కాలేవు... మరి చంద్రబాబు, రేవంత్ ల వల్ల ఇది సాధ్యమవుతుందా అన్న అనుమానాలు ప్రజల్లో వున్నాయి. ఈ భేటీలో ఏం జరుగుతుంది..? ఏ సమస్యలకు పరష్కారం లభిస్తుందన్నది అన్నది ఆసక్తికరంగా మారింది. 

click me!