మొట్టమొదటిసారిగా వరంగల్ నిట్... హైదరాబాద్ ఐఐటీని బీట్ చేసింది. నిట్ విద్యార్థి రూ.88లక్షల ప్యాకేజీ అందుకుని ఐఐటీని అధిగమించాడు.
హైదరాబాద్ : మొట్ట మొదటి సారిగా వరంగల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు తమ సత్తా చాటారు. క్యాంపస్ ప్లేసమెంట్ల రేసులో హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ-హెచ్)ని దాటేసి అధిక ప్యాకేజీకి ఎంపికయ్యారు. ఈ రేసులో హైదరాబాద్ కంటే వరంగల్ మెరుగ్గా నిలిచింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ-హెచ్)లో ఎలక్ట్రికల్ విభాగంలో చదువుతున్న ఓ ఎంటెక్ విద్యార్థి ఇటీవల రూ. 63.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఇది ఈ సీజన్‌లో అత్యధికం. అయితే, ఇప్పుడు దీన్ని వరంగల్ (ఎన్ఐటీ-డబ్ల్యూ)కు చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఆదిత్య సింగ్ అధిగమించాడు. అతను రూ. 88 లక్షల ప్యాకేజీ దక్కించుకున్నాడు. వరంగల్ నిట్ చరిత్రలో ఇప్పటివరకు విద్యార్థులు అందుకున్న ప్యాకేజీల్లో ఇదే అథ్యధికం అని నమ్ముతారు. గతేడాది ఓ విద్యార్థి రూ.62.5 లక్షల ప్యాకేజీ తీసుకున్నాడు.
undefined
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిన ప్రశ్నిస్తున్న పోలీసులు
"కంపెనీలు తమతో ఎక్కువ కాలం ఉండే అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. మా విద్యార్థుల రిటెన్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో ఐఐటీల కంటే మెరుగ్గా రాణించడానికి ఇది ఒక కారణమని భావిస్తున్నాం" అని వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్‌వి రమణ రావు అన్నారు. ఈ సంవత్సరం ఐఐటీల కంటే చాలా ఎన్ఐటీలు చాలా మెరుగ్గా పనిచేశాయి. ఐఐటీల నుంచి వెళ్లిన చాలా మంది ఉద్యోగంలో కొద్ది కాలం మాత్రమే ఉంటారు. మా విద్యార్థుల విషయంలో అలాకాదు. మేము నిరంతరం అప్ డేట్ అవుతున్నాం. అది మా నియామకాలలో ప్రతిబింబిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం, మా అత్యధిక ప్యాకేజీ 55 లక్షలు. ఈ ఏడాది అది ఐఐటీ కంటే మెరుగ్గా ఉంది’’ అని అన్నారు.
మొత్తంమీద, ఈ సంవత్సరం ఇప్పటివరకు వరంగల్ ఎన్ఐటీలో 724 మంది బీటెక్ విద్యార్థులు ఉన్నారు. కంప్యూటర్ సైన్స్‌కు చెందిన విద్యార్థుల సగటు ప్యాకేజీ, గత ఏడాది దాదాపు 25.5 లక్షలు ఉండగా, 2022-23 నాటికి 31.9 లక్షలకు చేరుకుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్లకు, సగటు జీతం ప్యాకేజీ వరుసగా రూ. 23.3 లక్షలు, రూ. 22.1 లక్షలుగా ఉంది.
మరోవైపు ఐఐటీ-హెచ్ లో ఫేజ్-1 ప్లేస్‌మెంట్స్‌లో 508 ఉద్యోగాలకు 700 మందికి పైగా ప్లేస్‌మెంట్స్ కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 474 మంది అభ్యర్థులు ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పటి వరకు అత్యధిక సగటు ప్యాకేజీ 19.5 లక్షలు. దీనిమీద ఐఐటి-హెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి స్పందిస్తూ, ఐఐటిల పని "విద్యార్థులకు బోధించడం, వారికి ఉత్తమ విద్యను అందించడం, వారికి సలహా ఇవ్వడం మాత్రమే.. అంతకానీ వారికి ప్లేస్ మెంట్స్ కల్పించడం కాదు. ఐఐటీల్లో ప్లేస్మెంట్ సెల్ ఉండని రోజు చూడాలనుకుంటున్నాను. దీనికోసం నేను ప్రయత్నిస్తున్నాను.. అన్నారు.