కడుపున పుట్టనివాడి ఆలనాపాలనా తానేందుకు చూడాలని భావించిందో ఏమో ఏడేళ్ల బాలున్ని ఓసారి బిల్డింగ్ పైనుండి తోసి, మరోసారి గొంతునులిమి అతి దారుణంగా చంపిందో కసాయి సవతి తల్లి.
హైదరాబాద్: కొడుకులా ప్రేమ చూపించకున్నా పర్వాలేదు... కనీసం అభం శుభం తెలియని చిన్నారి అన్న జాలి కూడా చూపలేదు ఆ కసాయి సవతితల్లి. తన కడుపున పుట్టనివాడి ఆలనాపాలనా చూడటం భారంగా భావించిందో ఏమో ఆడతనాన్ని, అమ్మతనాన్ని మరిచి అత్యంత దారుణంగా వ్యవహరించింది. అదృష్టవశాత్తు ఓసారి సవతితల్లి బారినుండి ప్రాణాలతో బయటపడ్డ బాలుడు రెండోసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఇలా సవతితల్లి చేతిలో ఏడేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయిన దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ నల్లకుంటలో భాస్కర్-సరిత దంపతులు నివాసముంటున్నారు. వీరివద్దే భాస్కర్ మొదటిభార్య కొడుకు ఉజ్వల్ (7) కూడా వుంటున్నాడు. తన కడుపున పుట్టకపోయిన ఆలనాపాలనా చూడాల్సి రావడంతో సవతి తల్లి సరిత బాలుడిపై ద్వేషాన్ని పెంచుకుంది. చివరకు బాలుడి అడ్డు తొలగించుకోవాలనే స్థాయికి ఈమె ద్వేషం పెరిగింది.
undefined
కొడుకు హత్యకు సిద్దపడ్డ సవతితల్లి సరిత సరైన సమయంకోసం ఎదురుచూసింది. ఈ క్రమంలోనే వారంరోజుల కింద భర్త పనిపై బయటకు వెళ్లగా ఇంట్లో బాలుడు, తల్లి మాత్రమే వున్నారు. ఇదే అదునుగా కొడుకును భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు హాస్పిటల్ లో చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇలా చిన్నారి బాలుడు గాయాలతో మంచానపడినా ఆ సవతి తల్లి మనసు కరగలేదు. కాస్త కోలుకున్నాక ఇంటికి తీసుకురాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి అమానుషానికి ఒడిగట్టింది ఆ కసాయి మహిళ. ఉజ్వల్ గొంతునులిమి అతి కిరాతకంగా చంపింది. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా కొడుకు చనిపోయాడని భర్త, కుటుంబసభ్యులకు తెలియజేసింది.
అయితే భార్య సరిత తీరుపై అనుమానం రావడంతో భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన కాచీగూడ పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో బాలుడిది హత్యగా తేలింది. భాస్కర్ అనుమానించినట్లుగానే పోలీసులు కూడా సవతితల్లి సరితను అనుమానించి విచారించారు. దీంతో తానే పథకం ప్రకారమే కొడుకును చంపినట్లు నిందితురాలు అంగీకరించింది.
మొదట భవనంపైనుండి తోసి చంపాలని చూసినా ఉజ్వల్ బ్రతకడంతో మరోసారి హత్యకు ప్లాన్ చేసానని సరిత తెలిపింది. ఈసారి గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపానని ఆమె తెలిపింది. దీంతో పోలీసులు సరితను అరెస్ట్ చేసి హత్య కేసులు నమోదు చేసారు.
కొడుకు ఆలనాపాలన చూస్తుందని సరితను రెండోపెళ్లి చేసుకున్నానని... ఆమె ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేదని భాస్కర్ వాపోయాడు. కొడుకు మృతదేహం వద్ద అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఉజ్వల్ ను చంపిన సవతితల్లి సరితను కఠినంగా శిక్షించాలని పోలీసులను స్థానికులు కోరుతున్నారు.