ఆరునూరైనా ప్రజా జీవితంలోనే ఉంటా: తేల్చేసిన తాటికొండ

By narsimha lode  |  First Published Aug 25, 2023, 4:31 PM IST

ఆరు నూరైనా తాను ప్రజల మధ్యే ఉంటానని  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  తేల్చి చెప్పారు.


వరంగల్:ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే ఉంటానని  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య చెప్పారు.శుక్రవారంనాడు తన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పలు  కార్యక్రమాల్లో  రాజయ్య పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  ఆయన  ప్రసంగించారు.పంట పండించి రాసి పోసిన తర్వాత ఎవరో వస్తా అంటే ఊరుకుంటానా అని  ఆయన వ్యాఖ్యానించారు. దేవుడు ఉన్నాడు, దేవుడి లాంటి కేసీఆర్ ఉన్నాడని రాజయ్య  పేర్కొన్నారు.

రేపో, మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని రాజయ్య ధీమాను వ్యక్తం  చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల కోసమే చచ్చిపోతానన్నారు. తన  ప్రాణం అడ్డేసైనా మిమ్మల్నికాపాడుకుంటానని రాజయ్య  తెలిపారు. చెట్టుకు కాయలు బాగా కాస్తే దెబ్బలు బాగా తగులుతాయన్నారు.  కాయలు లేని చెట్టు వైపు ఎవరూ కూడ రారని ఆయన చెప్పారు.బాగా కాయలున్న చెట్టులాంటి వ్యక్తిని తాననని  రాజయ్య తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నారు.

Latest Videos

also read:బీఆర్ఎస్ టిక్కెట్టు నిరాకరణ: అంబేద్కర్ విగ్రహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న రాజయ్య

ఈ నెల  21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో స్టేషన్ ఘన్ పూర్ నుండి  రాజయ్యకు టిక్కెట్టు దక్కలేదు.  ఈ స్థానం నుండి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి  కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చారు. తనకు టిక్కెట్టు రాకపోవడంతో  తన అనుచరులతో  రాజయ్య  కన్నీరు మున్నీరుగా విలపించారు. అంబేద్కర్ విగ్రహం ముందు  పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు రాజయ్య.  రాజయ్యతో సంప్రదింపులు జరిపేందుకు  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి  రెండు రోజుల క్రితం  స్టేషన్ ఘన్ పూర్ కు వెళ్లారు అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డికి  రాజయ్య  కలవలేదు. రాజయ్య అందుబాటులో లేకపోవడంతో  పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుదిరిగారు.  స్టేషన్ ఘన్ పూర్ లో కలిసి పనిచేయాలని  కడియం శ్రీహరి కూడ  తాటికొండ రాజయ్యను కోరారు. 

ఎన్నికల తర్వాత  రాజయ్యకు సముచిత స్థానం కల్పించనున్నట్టుగా బీఆర్ఎస్ నాయకత్వం రాజయ్యకు హమీ ఇచ్చింది. అయితే  ఈ విషయమై  రాజయ్య సంతృప్తి చెందలేదని సమాచారం. ఇవాళ రాజయ్య వ్యాఖ్యలను బట్టి చూస్తే  పోటీకి తాను  సిద్దంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  పార్టీ నిర్ణయానికి కట్టుబడి కడియం శ్రీహరికి  మద్దతుగా నిలుస్తారా,  లేదా  పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పోటీకి దిగుతారాన అనేది భవిష్యత్తు తేల్చనుంది. 

click me!