నమ్మక ద్రోహం చేశారు.. కంటతడి పెట్టిన మధుసూదనాచారి

By sivanagaprasad kodatiFirst Published Dec 25, 2018, 8:39 AM IST
Highlights

టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికల్లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. బాధను దిగమింగుతూనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయన తాజాగా ఓ వేదికపై కంటతడి పెట్టారు. 

టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికల్లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. బాధను దిగమింగుతూనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయన తాజాగా ఓ వేదికపై కంటతడి పెట్టారు.

సోమవారం భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశంలో స్పీకర్ పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓటమితో నేను పెద్దగా బాధపడటం లేదు.. కానీ తాను తీసుకొచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముక్కలవుతుందని పది రోజులుగా వింటున్న వార్తలతో నా గుండె పగిలిందని’’ ఆవేదన వ్యక్తం చేస్తూ కంట తడిపెట్టారు.

దీనిని తట్టుకోలేకపోయిన కార్యకర్తలు, నేతలు, మహిళలు ఉద్వేగానికి లోనై విలపించారు. గత నాలుగున్నరేళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలకు తాను సేవకుడిగా పనిచేశానని.. రాష్ట్రానికి తొలి స్పీకర్ అయినా నియోజకవర్గానికి నిత్యం అందుబాటులో ఉన్నా అన్నారు.

ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మనసు కలిచివేసిందన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల కంటే జయశంకర్ జిల్లాను నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలని రూ.వేలాది కోట్ల నిధులు తీసుకొస్తే.. అందుకు ఫలితం లేకుండా పోయిందని స్పీకర్ వాపోయారు.

శాసనసభ స్పీకర్‌గా దేశవిదేశాల్లో పర్యటించే అవకాశాలోచ్చినా నియోజకవర్గ ప్రజలకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో నెలకు కనీసం 20 రోజులు ప్రజల మధ్యనే గడుపుతూ, వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేశానన్నారు.

ఇప్పటి వరకు తనకు సొంతిల్లు కూడా లేదని... అయినా ప్రాణం ఉన్నంతవరకు భూపాలపల్లి అభివృద్ధికి శ్రమిస్తానని మధుసూదానాచారి స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూనే కొందరు నమ్మక ద్రోహాం చేశారని.. అలాంటి వారికి గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మెజారిటీ స్థానాలు గెలిచేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. 
 

click me!