
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కీలక అధికారిగా మారారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన కీలకమైన బాధ్యతలను సోమేష్ కుమార్ నెరవేర్చారు. కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో సోమేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం సోమేష్ కుమార్ రెవిన్యూలోనే ఎక్సైజ్ కమర్షియల్ టాక్సెస్ సెక్షన్ చూస్తున్నాడు. రెవిన్యూలో రిజిస్ట్రేషన్, స్టాంప్స్ విభాగాన్ని చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రాజేశ్వరీ తివారీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవలనే బదిలీ చేసింది.
సీసీఎల్ఏకు చీఫ్ కమిషనర్ గా ఆర్ఈఆర్ఏ కు ఛైర్మెన్ గా కూడ సోమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు.జీహెచ్ఎంసీ కమిషనర్ గా సోమేష్ కుమార్ ఉన్న సమయంలో హైద్రాబాద్ సీఎంగా ఆయనకు నిక్ నేమ్ ఉంది.హైద్రాబాద్ లో రూ. 5లకే భోజనం పథకాన్ని సోమేష్ కుమార్ ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత దగ్గరగా పేరున్న అధికారుల్లో సోమేష్ కుమార్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఎక్సైజ్ కమర్షియల్ టాక్స్ శాఖ టార్గెట్లను చేరుకోవడంలో సోమేష్ కుమార్ అవలంభించిన విధానాలు ప్రశంసలు పొందాయి.
ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసిన తర్వాత రాష్ట్రానికి రెవిన్యూ తగ్గకుండా ఆయన కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడ ఆయన రాబట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో సుధీర్ఘ కాలంగా పనిచేసిన సోమేష్ కుమార్ ఏనాడూ కూడ వివాదాల్లో ఇరుక్కోలేదు. కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసే బాధ్యతను సోమేష్ కుమార్ కు కేసీఆర్ అప్పగించే అవకాశం లేకపోలేదు. రెవిన్యూశాఖలో ఉన్న అవినీతిని రూపుమాపేందుకు కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు.