సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్.. కేబినెట్ హోదా.. ఉత్తర్వులు జారీ..

By Sumanth Kanukula  |  First Published May 9, 2023, 5:11 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నియమితులయ్యారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో సోమేష్ కుమార్ మూడేళ్లు కొనసాగనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. ఆయన నియమానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ విడిగా జారీ చేయబడతాయని తెలిపారు. 

ఇక, ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక రకాలు ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కేసీఆర్ సలహాదారుగా చేరుతారని లేదా రెరా చైర్మన్ అవుతారని లేదా బీఆర్ఎస్‌లో చేరి ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను సీఎం కేసీఆర్‌ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Latest Videos

ఇక, సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌  తీర్పు ఇచ్చింది.  అయితే క్యాట్ ఆర్డర్‌ను నిలిపివేయాలని కోరుతూ డీవోపీటీ 2016 మార్చిలో తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. డీవోపీటీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది. సోమేశ్ కుమార్‌ను తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. కేటాయింపు జాబితాలో జోక్యం చేసుకోవడం ద్వారా క్యాట్ తప్పు చేసిందని అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. 

హైకోర్టు తీర్పు వెలువడిని కొన్ని గంటలకు.. సోమేష్‌ కుమా‌ర్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. జనవరి 12లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ  ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అయితే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన సోమేష్ కుమార్.. కొద్దిరోజులకే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇక, సోమేష్ కుమార్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు నమ్మకస్తుడిగా ముద్ర ఉంది. 

click me!