షోలాపూర్ తొలి తెలుగు మహిళా మేయర్ కు కరోనా పాజిటివ్

By telugu teamFirst Published Jun 6, 2020, 9:48 AM IST
Highlights

మహారాష్ట్రలోని షోలాపూర్ తొలి తెలుగు మహిళా మేయర్ యెన్నం కాంచనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తెలంగాణకు చెందిన ఆమె భర్తకు కూడా కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ (ఎస్ఎంసీ) మేయర్ గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ యెన్నం కాంచనకు కరోనా వైరస్ సోకింది. ఆమెతో పాటు భర్త యెన్నం రమేష్ కు కూడా కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైద్యాధికారులు శుక్రవారంనాడు ధ్రువీకరించారు. దాంతో వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. 

ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన కాంచన 2019 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో షోలాపూర్ మేయరుగా ఎన్నికయ్యారు. మేయర్ దంపతులు ఇద్దరికి కూడా కరోనా వైరస్ సోకడంతో వారు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. 

లాక్ డౌన్ సమయంలో కాంచన ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అనే విషయాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ అమలులోకి రాగానే కరోనా వైరస్ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి కాంచన వివిధ ప్రాంతాల్లో తిరిగారు. 

గత వారం రోజులుగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దాంతో పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో ఆమె భర్తకు, ఆమె వెంట తిరిగిన పలువురు అధికారులకు, ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆమె భర్తకు తప్ప మిగతా వారందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. 

click me!