భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను ఎన్జీటీ నియమించిన ద్విసభ్య కమిటీ పరిశీలించింది. వచ్చే నెల 12వ తేదీలోపుగా ఎన్జీటీకి ద్విసభ్య కమిటీ నివేదిక ఇవ్వనుంది.
ఖమ్మం: భద్రాద్రి జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను ద్విసభ్య కమిటీ సభ్యులు పరిశీలించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీలో దాఖలైన పిటిషన్ పై ద్విసభ్య కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం మండలానికి చెందిన తెల్లం నరేష్, బొర్ర లక్ష్మీనారాయణలు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఎన్‌జీటీ ఆదేశించింది. అయినా కూడ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం లేదని మరోసారి ఎన్జీటీని పిటిషనర్లు ఆశ్రయించారు.
దీంతో ఇంజనీర్లు ప్రసాద్, తరుణ్ లతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ద్విసభ్య కమిటీని ఆదేశించింది. ఈ ఏడాది జూలై 12వ తేదీలోపుగా ఈ నివేదికను కమిటీ ఎన్జీటీకి అందించాల్సి ఉంది. దీంతో ద్విసభ్య కమిటీ బుధవారంనాడు సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలించింది. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ద్విసభ్య కమిటీ పరిశీలించింది.
సీతమ్మసాగర్ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులు, అధికారులతో కమిటీ వేర్వేరుగా సమావేశమైంది. ఇరువర్గాల నుండి సమాచారం తెలుసుకుంది. మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ప్రతినిధులతో కూడ ద్విసభ్య కమిటీ సమావేశమైంది.ప్రాజెక్టు పనుల గురించి కమిటీ వివరాలను తెలుసుకుంది.