టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును విచారిస్తున్న సిట్ అధికారులు మరోమారు కేరళకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి తుషార్, జగ్గుస్వామిలకు మరోమారు నోటీసులు అందజేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును విచారిస్తున్న సిట్ అధికారులు మరోమారు కేరళకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి తుషార్, జగ్గుస్వామిలకు మరోమారు నోటీసులు అందజేశారు. తుషార్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. కొచ్చినలోని జగ్గుస్వామి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. గతంలో కూడా సిట్ అధికారులు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే తుషార్, జగ్గుస్వామి విచారణకు హాజరుకాలేదు.
ఇక, ఈ కేసుకు సంబంధించి సిట్ నోటీసులపై తుషార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తుషార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని సిట్‌ను ఆదేశించింది. అలాగే విచారణకు సహకరించాలని తుషార్‌కు స్పష్టం చేసింది. అభ్యంతరాలుంటే తమను ఆశ్రయించాలని హైకోర్టు తుషార్‌కి సూచించింది.
మరోవైపు తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పంపిన 41 సీఆర్‌పీసీ నోటీసులపై, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని జగ్గుస్వామి తన పిటిషన్‌లో కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. జగ్గుస్వామి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.