గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు కేసీఆర్ సర్కార్ పంపిన రెండు పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఈ పరిణామం మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ అంశంపై చర్చకు కారణమైంది.
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు సిఫారసు చేసిన ఇద్దరి పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరంపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.
తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే ఈ గ్యాప్ తగ్గిందని అంతా భావించారు. కానీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసిన పేర్లను తిరస్కరించడంతో గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ను బీజేపీ నేతగా విమర్శలు గుప్పిస్తున్నారు.
undefined
2021లో ఆగస్టు రెండో తేదీన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది. అయితే కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కేబినెట్ సిఫారసును గవర్నర్ తిరస్కరించారు. దీంతో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు కేసీఆర్.
గవర్నర్ పర్యటన సమయంలో ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. గవర్నర్ పర్యటన సమయంలో అధికారులు ప్రోటోకాల్ ను పట్టించుకోవడం మానేశారని గవర్నర్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.ప్రోటోకాల్ పాటించకపోయినా తాను పట్టించుకోనని గవర్నర్ గతంలోనే పేర్కొన్నారు.
గవర్నర్ వ్యవహరించిన తీరుపై మంత్రులు బహిరంగంగానే విమర్శలు చేశారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపలేదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపలేదని సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో కూడ గవర్నర్ వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు అంశంపై కూడ పెద్ద వివాదమే సాగింది.
అయితే గత మాసంలో తన మంత్రివర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డిని కేసీఆర్ తీసుకున్నారు. అయితే పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత గవర్నర్ తో కేసీఆర్ 10 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయంలో మసీదు, చర్చి, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవంలో కేసీఆర్ తో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్ కు కేసీఆర్ దగ్గరుండి సచివాలయాన్ని చూపించారు. ఈ ఘటనతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం తగ్గిందని భావించారు.
గవర్నర్ గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో ఓ పుస్తకాన్ని గవర్నర్ ఇటీవల విడుదల చేశారు. నాలుగేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్ ప్రస్తావించారు. అంతేకాదు కేసీఆర్ నుండి తాను కొన్ని విషయాలను నేర్చుకున్నట్టుగా ఆమె తెలిపారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర కేబినెట్ పంపింది. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయలేమని గవర్నర్ తేల్చి చెప్పారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు. ఈ లేఖ పంపడంపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి.