అదే చివరిసారి, అలా చేయడం తప్పే: జయరాం హత్యపై శిఖా చౌదరి

By pratap reddyFirst Published Feb 8, 2019, 8:43 AM IST
Highlights

జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని శిఖా చౌదరి చెప్పారు. మరణించారని తెలిసిన తర్వాత జయరాం ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై ఆమె వివరణ ఇచ్చారు. 

హైదరాబాద్‌: తన మేనమామ చిగురుబాటి జయరాం హత్యపై తొలిసారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి మీడియా ముందుకు వచ్చారు. గురువారం సాయంత్రం వివిధ తెలుగు టీవీ చానెళ్లకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. జయరాం హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు.  

జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని శిఖా చౌదరి చెప్పారు. మరణించారని తెలిసిన తర్వాత జయరాం ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై ఆమె వివరణ ఇచ్చారు. అంతకుముందు జయరాం తన ప్రాజెక్టు రిపోర్టును ఇంటికి తీసుకెళ్లారని, దాన్ని తెచ్చుకునేందుకే ఆయన ఇంటికి వెళ్లానని ఆమె చెప్పారు. 

తన అత్త పద్మశ్రీతో తమకు సత్సబంధాలు లేవని, ఆమె వస్తే తాను ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదని, అందుకే అమెరికా నుంచి ఆమె వచ్చేలోపే ఇంటికి వెళ్లి ప్రాజెక్టు రిపోర్టు తెచ్చుకున్నానని ఆమె వివరించారు. జయరాం ఇంట్లోంచి తానెలాంటి విలువైన డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోలేదని చెప్పారు. 

అంకుల్‌ చనిపోయారని తెలిసినా తన ప్రాజెక్టు వర్క్‌ గురించి ఆలోచించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. తాను అలా ప్రవర్తించడం సరికాదని అంగీకరించారు. హత్య జరిగిన రోజూ ఆయన తనతో మాట్లాడారని చెప్పారు. 29వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు అంకుల్‌ తమ ఇంటికి వచ్చారని, రాత్రి 8గంటల దాకా తన కొత్త ప్రాజెక్టు వర్క్‌ గురించి మాట్లాడుకున్నామని చెప్పారు.
 
తిరిగి వెళ్తూ తన  ప్రాజెక్టు రిపోర్టును జయరాం వెంట తీసుకెళ్లారని చెప్పారు.. మరుసటి రోజు ఉదయం తనకు ఫోన్‌ చేసి రూ. కోటి సర్దాల్సిందిగా అడిగారని, ఎందుకని అడిగేంత అవకాశం కూడా తనకు ఇవ్వకుండా వెంటనే ఫోన్‌ పెట్టేశారని అన్నారు. 31వ తేదీ ఉదయం కూడా ఫోన్‌చేసి డబ్బు అడిగారని, ఎందుకని అడిగితే.. ఏడాది క్రితం తాను ఒకరి వద్ద రూ.4కోట్లు అప్పు తీసుకున్నట్లు, వాళ్లు తీర్చాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారని ఆమె వివరించారు. 

తాను జయరాంతో మాట్లాడటం అదే చివరిసారి అని, మరుసటి రోజు ఉదయం తన అమ్మ ఫోన్‌చేసి అంకుల్‌ చనిపోయారని చెబితేనే తనకు తెలిసిందని అన్నారు. జయరాంకు సంబంధించిన ఆస్తిపాస్తులేవీ తన పేరుమీద లేవని చెప్పారు. 

తనకు 2017లో రాకేశ్‌రెడ్డితో పరిచయమైందని, అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో దూరం పెట్టానని శిఖా చౌదరి చెప్పారు. ఏడునెలల్లో అతడితో తాను మాట్లాడలేదని చెప్పిందని, రూ.4కోట్లు అప్పిచ్చే స్థోమత రాకేశ్‌కు లేదని ఆమె ్న్నారు. హత్య కేసులో అత్త పద్మశ్రీని ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తన భర్త హత్యలో శిఖా చౌదరి పాత్ర లేదంటే తాను నమ్మబోనని జయరాం భార్య పద్మశ్రీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చెక్ పవర్ కూడా శిఖా చౌదరికే ఉందని కూడా ఆమె చెప్పారు.

click me!