
హైదరాబాద్ : ‘మీ బాబాయ్ కి చెప్పి కొట్టిస్తా.. అని బెదిరించి ఓ auto driver బాలికపై sexual harassmentకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ntr nagarకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక తల్లితో కలిసి ఉంటోంది. వారి ఎదురింట్లో ఉంటున్న షేక్ సలీం (30) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను తరచుగా గొడవ పడుతుండడంతో కొద్ది రోజుల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
మూడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీమ్ అతని ఇంటి ఎదురుగా ఉన్న బాలిక మీద కన్నేశాడు. మూడు రోజులుగా పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు బాలికకు ఆమె బాబాయ్ అంటే భయం ఉండడంతో... ఈ విషయం బయటికి చెబితే మీ బాబాయ్ కి చెప్పి కొట్టిస్తానని బెదిరించడంతో ఆమె భయపడి ఎవ్వరికీ చెప్పలేదు. అయితే, గురువారం బాధితురాలు సలీమ్ ఇంట్లో నుంచి రావడాన్ని గుర్తించిన పక్కన ఉండే మరో మహిళ... తల్లి దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ఆమె బాలికను నిలదీయడంతో మూడు రోజులుగా సలీం తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది.
దీంతో ఆమె స్థానికుల సహాయంతో సలీమ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు షేక్ సలీంను ఎల్బీనగర్ పోలీస్ అరెస్టు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరిచారు.
కాగా, జూన్ 9న హైదరాబాద్ లోని Shamshabadలో అడ్డా నుంచి మహిళా కూలీని పని ఉందని చెప్పి.. తీసుకువెళ్ళిన కామాంధులు ఆమెపై molestationకి పాల్పడడంతో పాటు.. అంతమొందించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాధితురాలు మృత్యువాత పడింది. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మదనపల్లి తండాకు చెందిన ఓ మహిళ (40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్ లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు work ఉందంటూ ఆమె ను పిలిచారు.
ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వ గూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడుని బాధితురాలు తన రెక్కల కష్టంతో పోషిస్తుంది. చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితం వివాహం చేసింది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.