బ్యాంకుకు రూ. 5 కోట్ల టోకరా: దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Nov 19, 2020, 10:22 AM IST
Highlights

తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు తీసుకొని మోసం చేసిన దంపతులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 5 కోట్లకు ఇండియన్ బ్యాంకుకే ఎసరు పెట్టినట్టుగా పోలీసులు చెప్పారు.

షాద్‌నగర్: తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు తీసుకొని మోసం చేసిన దంపతులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 5 కోట్లకు ఇండియన్ బ్యాంకుకే ఎసరు పెట్టినట్టుగా పోలీసులు చెప్పారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబంతి ప్రభాకర్, సరిత భార్యాభర్తలు, వీరు హైద్రాబాద్ టోలిచౌక్ లో ఉంటున్నారు.

సాయి ప్రాపర్టీ డెవలపర్స్ సంస్థను వీరు ఏర్పాటు చేశారు. షాద్‌నగర్, నాగోల్, బండ్లగూడ, రాజేంద్రనగర్, నార్సింగ్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 

భూములు కొనుగోలు చేసి వాటిని విక్రయించేవారు. రియల్ ఏస్టేట్ వ్యాపారంలో వీరు నష్టపోయారు. ఊరికి చివరగా ఉన్న భూములు కొనుగోలు చేసి ప్లాట్లు చేసి విక్రయించే ప్రయత్నం చేస్తే వారికి కలిసి రాలేదు.

షాద్ నగర్ పరిధిలోని సోలీపూర్ గ్రామంలో ప్రభాకర్ దంపతులు కొన్నేళ్ల క్రితం 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు గాను 2015లో షాద్ నగర్ లోని ఇండియన్ బ్యాంకు నుండి లోన్ తీసుకొన్నారు.

 ఇక్కడ ఇళ్లను నిర్మించి విక్రయించినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారు.ఫతుల్లాగూడ కు చెందిన దివాకర్ సింగ్ కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకొన్నారు. కానీ డబ్బులు చెల్లించలేదు. కిరణ్ కుమార్ రెడ్డిని అనే వ్యక్తిని కూడ మోసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ఇలా మోసం చేస్తుండడంతో వీరిపై అబ్దుల్లాపూర్ మెట్, కేపీహెచ్‌బీ, రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్ తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

తీసుకొన్న రుణాన్ని ప్రభాకర్ దంపతులు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. తప్పుడు పత్రాలతో రుణం తీసుకొన్నట్టుగా తేలింది. దీంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నెల 17వ తేదీన టోలిచౌకిలో ప్రభాకర్ ను ఆయన భార్యను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.  
 

click me!