బీజేపీలోకి క్యూ: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచిన కమలం

By narsimha lodeFirst Published Jun 24, 2019, 3:40 PM IST
Highlights

తెలంగాణలో  పలు పార్టీల నుండి  బీజేపీ వైపుకు  వలసలు పెరగనున్నాయి. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన  నేతలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు


హైదరాబాద్: తెలంగాణలో  పలు పార్టీల నుండి  బీజేపీ వైపుకు  వలసలు పెరగనున్నాయి. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన  నేతలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. తెలంగాణలో  బలపడేందుకు బీజేపీ ఆయా పార్టీల్లోనినేతలకు గాలం వేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో  టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి మంచి ఊపును ఇచ్చాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని  బీజేపీ కొంత కాలంగా ప్రచారం చేస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఒక్క స్థానాన్ని ఎక్కువగా గెలుచుకొంది.

బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలపై కేంద్రీకరించారు.  ఈ రాష్ట్రాల్లో  సభ్యత్వాన్ని  కూడ గతం కంటే ఎక్కువగా చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం  స్థానిక నేతలకు సూచించింది.

ప్రధానంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై బీజేపీ అగ్రనేతలు మురళీధర్ రావు, రామ్ మాధవ్‌లు దృష్టి పెట్టారు. మురళీధర్ రావు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. రామ్ మాధవ్  ఏపీకి చెందినవాడు. ఈ ఇద్దరు నేతలు కూడ ఈ రెండు రాష్ట్రాలపై గురిపెట్టారు. ఆయా పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నిస్తున్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖరారైంది. ఈ నెల 28వ తేదీన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. మరో వైపున  మరికొందరు నేతలు కూడ ఆయన బాటలోనే పయనిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ , ఆరేపల్లి మోహన్‌, శశిధర్‌ రెడ్డిలు బీజేపీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.

మాజీ మంత్రులు టీడీపీ నేత పెద్దిరెడ్డి, ,మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డిలు టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు.మరో మాజీ మంత్రి బోడ జనార్ధన్ కూడ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. 

 వీరిద్దరూ బీజేపీలో చేరుతారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు బలరామ్  నాయక్,సర్వే సత్యనారాయణలు కూడ బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని బలరామ్ నాయక్, సర్వే సత్యనారాయణలు ఖండించారు.

టీఆర్ఎస్‌కు చెందిన నేతలపై కూడ బీజేపీ నాయకత్వం గాలం వేస్తోందని సమాచారం. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లోని టీఆర్ఎస్ కీలక నేతలతో కూడ బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారని అంటున్నారు. ఈ నెలాఖరుకు ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

click me!