
వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందారు. వివరాలు.. ధరూర్ మండలం కేరెల్లి శివారులో గురువారం ఉదయం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అదుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడినవారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందతున్న వారిలో ఒకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
మృతుల్లో ఆటో డ్రైవర్ జమీల్, రవి, కిషన్, సోనీబాయిగా గుర్తించారు. మృతులు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మధనాంతపూర్ తండా, రేగొండిలకు చెందిన వారి తెలుస్తోంది. ఆటోలోని వారు కూలీ పనుల కోసం వికారాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లాలోని కన్సాన్‌పల్లి వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. వివరాలు.. ఆందోల్ మండలం కన్సాన్‌పల్లి శివారులో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.