పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు.
మునుగోడు: పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మునుగోడులో బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.పోలీసులను అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ తమ నేతలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఎన్నికల ప్రచారం ముగిసినా కూడా నియోజకవర్గంలో స్థానికేతరులైన టీఆర్ఎస్ నేతలున్నారని ఆయన ఆరోపించారు. రెండు రోజులుగా తమ పార్టీ నేతలను టీఆర్ఎస్ బెదిరింపులకు దిగిందని చెప్పారు .తమ పార్టీ నేతలు గ్రామం వదిలి వెళ్లాలని బెదిరించారన్నారు. లేకపోతే చంపుతామని కూడ వార్నింగ్ లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
అక్రమ కేసులు పెట్టి తమ పార్టీ నేతలను అరెస్ట్ చేశారన్నారు.
తనను ఓడించేందుకు 16 మంది మంత్రులు, 100 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ మోహరించిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.అవినీతి సొమ్మును టీఆర్ఎస్ నేతలు మునుగోడులో పంచారని ఆయన ఆరోపించారు. మునుగోడు ప్రజలకు తాను సేవ చేశానని ఆయన గుర్తు చేశారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపు నిలుస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
also read:మునుగోడు బైపోల్ 2022: మర్రిగూడలో బీజేపీ ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జీ
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.