టీ బీజేపీలో టికెట్ల కోసం దరఖాస్తు చేయని ముఖ్య నాయకులు.. నేతల తీరుపై క్యాడర్‌లో అసంతృప్తి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పార్టీ  నేతలు,  కార్యకర్తల నుంచి 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

Google News Follow Us

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పార్టీ  నేతలు,  కార్యకర్తల నుంచి 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులు చేసుకున్నవారిలో మహిళలు, యువత సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే పార్టీ‌లో ముఖ్య నేతలు చాలా మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరిలో చాలా మంది అసెంబ్లీ ఎన్నికల్లో నిలవాలని చూస్తున్నవారే కావడం గమనార్హం. 

దరఖాస్తు చేసుకోని వారిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేల ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, పార్టీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇదిలా ఉంటే, టీ బీజేపీ ముఖ్య నేతలుగా ఉన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిలు మాత్రం ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 

అయితే ఎన్నికల బరిలో ఉంటారని భావిస్తున్న పలువురు ముఖ్య నేతలు దరఖాస్తులకు దూరంగా ఉండటం పార్టీ క్యాడర్‌ సైతం అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది క్యాడర్‌కు మంచి సంకేతం ఇచ్చేలా లేదని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ముఖ్య నేతలు దరఖాస్తుకు దూరంగా  ఉన్నారంటే వారు ఎన్నికల్లో పోటీకి సుముఖంగా లేరా?, ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న ముఖ్య నేతలే దరఖాస్తు చేసుకోకపోతే.. ఈ ప్రక్రియను ఎందుకు చేపట్టారు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో కీలక నేతలుగా  ఉన్నవారు టికెట్ల కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోలేదనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించి.. ముఖ్య నేతలే అందులో భాగస్వామ్యం కాకపోవడం ఇతర పార్టీలకు అస్త్రంగా  మారే అవకాశం లేకపోలేదు. 

పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రముఖుల్లో.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ రాంచందర్‌రావు (మల్కాజ్‌గిరి), దుబ్బాక ఎమ్మెల్యే ఎం రఘునందన్‌రావు (దుబ్బాక), పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి (ఎల్‌బీ నగర్‌), పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ (ఖైరతాబాద్‌), మాజీ మంత్రి బాబూ మోహన్ (అందోల్), బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు  విజయలక్ష్మి (ముషీరాబాద్),  ఈటల రాజేందర్ భార్య ఈటల జమున (గజ్వేల్) లు ఉన్నారు.  
 

Read more Articles on