కలకలం రేపుతున్న వరుస హత్యలు.. హైదరాబాద్ లో ఒకేరోజు ముగ్గురు.. !!

Published : Apr 02, 2021, 12:24 PM IST
కలకలం రేపుతున్న వరుస హత్యలు.. హైదరాబాద్ లో ఒకేరోజు ముగ్గురు.. !!

సారాంశం

వరుస హత్యలతో హైదరాబాద్ అట్టుడికి పోతోంది.. కారణం చిన్నదైనా, పెద్దదైనా మనిషి ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. నగరంలో ఒక్కరోజే మూడు హత్యలు వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. 

వరుస హత్యలతో హైదరాబాద్ అట్టుడికి పోతోంది.. కారణం చిన్నదైనా, పెద్దదైనా మనిషి ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. నగరంలో ఒక్కరోజే మూడు హత్యలు వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. 

బుల్లెట్ పై వెళ్తున్న ఓ రౌడీ షీటర్ ను ప్రత్యర్థులు ఆటోలో వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. పాత కక్షలేఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మైలార్‌దేవుపల్లి పోలీస్‌స్టేషన్ 
పరిధిలోని వట్టేపల్లి ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దారుణ హత్య జరిగింది. 

పోలీసులు, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం శాస్త్రిపురం డివిజన్ పరిధి వట్టేపల్లి లో నివాసముండే అసద్ ఖాన్ రియల్టర్. ఇతనిపై మైలార్‌దేవుపల్లి పోలీస్‌స్టేషన్ లో రౌడీషీట్ ఉంది. 2018లో వట్టేపల్లికి చెందిన మహ్మద్ అంజద్ హత్య కేసులో  అసద్‌ ఖాన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఆ కేసులో అసద్ ఖాన్ జైలుకు వెళ్లి వచ్చాడు. సంవత్సరంపాటు పీడీ యాక్ట్ అనుభవించాడు.  అసద్‌ ఖాన్‌ కు ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం. గురువారం మధ్యాహ్నం తన బుల్లెట్ మీద వట్టేపల్లి ఇండియా ఫంక్షన్ హాల్ వైపు వెళ్తుండగా.. ఆటో లో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతని మీద కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

చనిపోయాడని కన్ ఫర్మ్ అయ్యేవరకు పొడిచి పొడిచి చంపారు. తలను చిధ్రం చేశారు. అనంతరం కత్తులను అక్కడే పారేసి ఆటోలో రాంగ్‌రూట్‌లో పారిపోయారు. సమాచారం అందుకున్న మైలార్ దేవులపల్లి ఇన్స్పెక్టర్ కె నరసింహ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఆ తరువాత శంషాబాద్ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆర్‌.సంజయ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నామని తెలిపారు. అసద్‌ఖాన్‌ బావమరిది నజీర్‌ఖాన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మ తెలిపారు.

ఇలా ఉండగా మరో కేసులో  చిక్కడపల్లి సూర్య నగర్ ప్రాంతంలో నివసించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. హతుడి రూమ్ లో ఉండే మరో వ్యక్తి ఆచూకీ లేకపోవడంతో అతడి ప్రమేయంపై పోలీసులు అనుమానిస్తున్నారు.

పంజాబ్ కు చెందిన సద్‌నామ్‌సింగ్‌ (30) కొన్నాళ్ళ క్రితం తన భార్య బల్జీత్‌ కౌర్‌తో కలిసి నగరానికి వచ్చాడు. ఏడేళ్ల కుమారుడితో కలిసి లో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సద్‌నామ్‌సింగ్‌ నారాయణగూడ లోని జాహ్నవి కళాశాల వద్ద  ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.

తన కొడుకుతో కలిసి బల్జీత్‌ కౌర్‌ గత నెల 10 నుంచి అఫ్జల్‌గంజ్‌ గురుద్వార్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు ఆఖరుసారిగా తన భర్తతో ఫోన్‌లో మాట్లాడింది. గురువారం తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదు. సాయంత్రం తన స్నేహితులతో కలిసి సూర్యానగర్ కు వచ్చి చూడగా, రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. 

దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం స్థితిగతుల్ని బట్టి బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.  ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో  సహాయకుడిగా పని చేసేందుకు వీరి సమీప బంధువు నిషాంత్‌ సింగ్‌ 20 రోజుల క్రితం నగరానికి వచ్చి సద్‌నామ్‌సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. 

అయితే రాత్రి నుంచి అతడి ఆచూకీ లేదు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో అతడి ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సమీప బంధువైన నిషాంత్‌ సింగ్‌ వీరింటికి వచ్చిన కొన్ని రోజులకే బల్జీత్ కౌర్ తన కొడుకుతో గురుద్వారాకు వెళ్లిపోవడానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

మరో కేసులో హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో దారుణం జరిగింది. భార్యభర్తల గొడవ అపార్ట్ మెంట్ లో దుర్వాసనకు కారణమయ్యింది. భర్తను హత్యచేసి.. ఎంచక్కా ఫ్రిజ్ లో పెట్టి భార్య, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటన స్తానికంగా తీవ్ర కలకలానికి దారి తీసింది. 

వివరాల్లోకి వెడితే.. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్ లోని ఓ ప్లాట్ లో నుండి దుర్వాసన రావడంతో పక్క ప్లాట్స్ వాళ్లు ఓనర్ కి తెలిపారు. ఆ ప్లాట్లో సిద్దిఖ్ అహ్మద్ అనే 38 ఏళ్ల వ్యక్తి తన భార్య రుబీనా, పిల్లలతో అద్దెకు ఉంటున్నాడు.  

ఇంటికి తాళం వేసి ఉంది. రుబీనా రెండు రోజుల కిందటే పిలల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. సిద్దిఖ్ అహ్మద్ జాడ తెలియలేదు. ఆ తరువాతి నుంచి వాసన రావడంతో గందరగోళం మొదలయింది. వెంటనే ఓనర్ పోలీసులకు ఫోన్ చేశాడు.

వారు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇళ్లంతా నీట్ గా సర్దిపెట్టి ఉంది. ఎక్కడా ఏమీ దొరకలేదు. కాకపోతే వాసన మాత్రం ఆ ఇంట్లోనుంచే వస్తుంది. ఇళ్లంతా వెతికి, చివరకు అనుమానంతో పోలీసులు ఫ్రిజ్ ఓపెన్ చేసి చూశారు. అందులో ఓ శవం ఉంది.

ఎవర్నో చంపి, ప్రిజ్ లో కుక్కి మరీ ఆ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని తెలిసింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

పోలీసుల విచారణలో ఆ శవం సిద్దిఖ్ అహ్మద్ దే అని యజమాని గుర్తించాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. భర్తను హత్యచేసి, ఫ్రిజ్ లో పెట్టి ఏమీ ఎరగనట్టు ఇంటికి తాళం వేసి వెళ్లిన భార్యగురించి అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి..? భార్యాభర్తల మధ్య విబేధాలు ఉన్నాయా? అందరూ అనుకుంటున్నట్లు హత్యకు భార్యకు సంబంధం ఉందా? వివాహేతర సంబంధాలు ఏమైనా ఈ ఘటనకు కారణమా? ఆస్తి గొడవలు ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. 

పుట్టింటికి వెళ్లిన భార్యకు, భర్త మరణం గురించి సమాచారం అందించారు. విచారణకుపోలీస్ స్టేషన్ కు త్వరలోనే పిలిపిస్తామని తెలిపారు. దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Airports in India : అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే.. ఎన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసా?
CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu