సెప్టెంబర్‌లోనే: నాడు సకల జనుల సమ్మె, నేడు ఆర్టీసీ జేఎసీ స్ట్రైక్

By narsimha lodeFirst Published Oct 7, 2019, 8:00 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానమైన డిమాండ్. తెలంగాణ ఉద్యమంలో కూడ ఆర్టీసీ కార్మికులు 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. 

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి కీలకమైన సకల జనుల సమ్మె సాగిన సెప్టెంబర్ మాసంలోనే ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఆర్టీసీ కార్మికులు 42 రోజుల పాటు  సమ్మె చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ తో జేఎసీ నేతలు సమ్మె బాట పట్టారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కీలకమైన ఉద్యమం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు సమ్మె  చేశారు. ఈ సమ్మెలో ఆర్టీసీ, తెలంగాణ ఎన్‌జీవోలు, సింగరేణి కార్మికులు కీలకంగా ఉన్నారు.

2011 సెప్టెంబర్ 13వ తేదీ నుండి ఆనాడు సకల జనుల సమ్మె ప్రారంభమైంది. సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కూడ దసరా పర్వదినం వచ్చింది. 

తెలంగాణలో దసరా పెద్ద పండుగ. ఈ పండుగ సమయంలో సమ్మెలో ఉన్న వారికి జీతాలు చెల్లించలేదు. సమ్మె విరమించిన తర్వాత ఈ మూడు విభాగాల్లోని సమ్మె చేసిన కాలాన్ని స్పెషల్ లీవ్ గా పరిగణిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఎసీగా ఏర్పడ్డాయి. ఈ జేఎసీ నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలోనే సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నోటీసుపై ఆర్టీసీ యాజమాన్యం నుండి కానీ, లేబర్ కమిషనర్ కార్యాలయం నుండి స్పందన రాలేదని జేఎసీ నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ఐఎఎస్ కమిటీతో చర్చించినా ప్రయోజనం లేకపోయింది.దీంతో ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఒక్క రోజును ప్రభుత్వం గడువుగా ఇచ్చింది.

ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఆరు గంటలలోపుగా విధుల్లో చేరిన వారినే ఆర్టీసీలో ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించింది. అన్నట్టుగానే ఈ నెల 6వ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపుగా విధుల్లో సుమారు 1200 మంది చేరినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.తమ డెడ్‌లైన్ ముగిసినా విధుల్లో చేరని ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా ఈ నెల 7వ తేదీ రాత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు.

 2011లో సకల జనుల సమ్మె కూడ సెప్టెంబర్ మాసంలోనే ప్రారంభమైంది. 42 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగింది. అదే ఏడాది అక్టోబర్ 24వ తేదీన సమ్మె ముగిసింది. ఆనాడు సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు కీలకంగా ఉన్నారు.

నాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ రకమైన పాత్ర పోషించిందో... నేడు ఆర్టీసీని రక్షించుకొనేందుకు తమ సమ్మె కూడ అదే రకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని ఆర్టీసీ జేఎసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


 

click me!