
హైదరాబాద్:ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా విద్యార్ధి సంఘాలు బస్ భవన్ ను సోమవారం నాడు ముట్టడించాయి. బస్ భవన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్ధి సంఘాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 19 వ తేదీ వరకు ఆర్టీసీ జేఎసీ, అఖిలపక్షాలు ఆందోళన కార్యక్రమాలను ప్రకటించాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థి సంఘాలు ఇవాళ బస్ భవన్ ను ముట్టడించాయి. వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.
తమ డిమాండ్ల సాధాన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందంచడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
విద్యార్ధి సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి. హైద్రాబాద్ లో బస్ భవన్ ను విద్యార్థి సంఘాలు ముట్టడికి ప్రయత్నించాయి. పోలీసులు విద్యార్ధి సంఘాలను అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో విద్యార్ధి సంఘాల నేతలు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.