వేటు, మిగిలింది 1200 మందే: ఆర్టీసిపై కేసీఆర్ సంచలన నిర్ణయం

By telugu teamFirst Published Oct 6, 2019, 9:09 PM IST
Highlights

శనివారం సాయంత్రం ఆరు గంటల లోగా విధులకు హాజరైన ఆర్టీసి కార్మికులు మాత్రమే తమ ఉద్యోగులని, మిగతావాళ్లు తమ ఉద్యోగులు కారని తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆర్టీసిపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

హైదరాబాద్: ఆర్టీసి సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం వరకు హాజరైనవారు మాత్రమే తమ ఉద్యోగులని, మిగతావాళ్లు తమ ఉద్యోగులు కారని ఆయన అన్నారు. 

ప్రభుత్వం విధించిన శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు విధులకు హాజరైనవారు 1200 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. వారు మాత్రమే తమ ఉద్యోగులనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక తమ ఆర్టీసి ఉద్యోగులు 1200 మాత్రమేనని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 15 రోజుల్లో ఆర్టీసికి పూర్వ స్థితిని తెస్తామని చెప్పారు. గడపదాటినవారు తిరిగి గడప లోపలికి వచ్చే అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. ఆర్టీసీ నడిపే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయని చెప్పారు. కొద్ది రోజుల్లోనే కొత్త ఉద్యోగులను తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారితో యూనియన్లలో చేరబోమని హామీ పత్రం తీసుకోవాలని ఆయన సూచించారు. నెలకు సగటున రూ.50 వేల జీతం ఇస్తున్నానని, ఇంకా పెంచాలని అడగడంలో అర్థం లేదని ఆయన అన్నారు. 

ఆర్టీసి నష్టాల్లో ఉన్న విషయాన్ని, పండుగ సమయాన్ని పట్టించుకోకుండా కార్మికులు సమ్మెకు దిగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణ చర్యగా 2,500 ప్రైవేట్ బస్సులను నడపాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన అన్నారు. ఆర్టీసి జెఎసితో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఆయన స్పషటం చేశారు. రెండు, మూడేళ్లలో ఆర్టీసి లాభాల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. 

ఆర్టీసి మనుగడ సాగించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన అన్నారు. కర్ణాటక తర్వాత అత్యధిక బస్సులు ఉన్నవి తెలంగాణకేనని అన్నారు. ప్రైవేట్, ఆర్టీసి భాగస్వామ్యంతో ఇక ముందు బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు. 

తెలంగాణ ఆర్టీసి చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏడాదికి రూ.1200 కోట్ల నష్టం, రూ.5000 కోట్ల రుణభారం, క్రమం తప్పకుండా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, ఆదీ పండుగ సీజన్లో దిగినవారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని ఆయన స్పష్టం చేసింది.

వారు చేసింది తీవ్రమైన తప్పిదమని సమ్మెకు దిగిన కార్మికులను ఉద్దేశించి అన్నారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటామని, 4114 ప్రైవేట్ బస్సులు ఇంకా ఉన్నాయని ఆయన తెలిపారు. వాటికి స్టేజ్ క్యారేజ్ గా చేస్తే వాళ్లు కూడా ఆర్టీసి పరిధిలోకి వస్తారని చెప్పారు.

click me!