కార్మికులను చీల్చే కుట్ర, నోటీసులు అందలేదు: అశ్వత్థామ రెడ్డి

By telugu teamFirst Published Oct 6, 2019, 8:39 PM IST
Highlights

టీఎస్ ఆర్టీసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్మికులను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు హైకోర్టు నుంచి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్:  ప్రభుత్వం ఆర్టీసి కార్మికులను చీల్చేందుకు కుట్ర చేస్తోందని ఆర్టీసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. 50 వేల మంది కార్మికులు సమ్మెలో ఉన్నారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఎన్ని బస్సులు నడిపిందో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఆర్టీసి సమ్మె రెండో రోజు విజయవంతమైందని ఆయన చెప్పారు. సోమవారం నుంచి హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల కుటుంబాలతో కలిసి అన్ని డిపోల ముందు నిరసనలు చేపట్టామని, తమ సమ్మెకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. 

ప్రజలు కూడా తమ సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసిని ప్రైవేట్ పరం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన విమర్శించారు. కార్మికులపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికులకు ఈ నెల జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం పథకం రచిస్తోందని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ప్రయాణికులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ఇష్టానుసారంగా చార్జీలను పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని అశ్వత్థామ రెడ్డి అన్నారు. 

2600 బస్సులను నడుపుతామని ప్రభుత్వం రెచ్చగొడుతోందని, వాటిని తప్పకుండా తాము అడ్డుకుంటామని చెప్పారు. తమకు హైకోర్టు నుంచి ఏ విధమైన నోటీసులూ రాలేదని చెప్పారు. సోమవారం నుంచి నిర్వహించ తలపెట్టిన దీక్షకు ఇంకా అనుమతి లభించలేదని, అనుమతి లభించకపోయినా దీక్ష చేస్తామని ఆయన చెప్పారు. 

click me!