ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామ రెడ్డి నోట కేసీఆర్ నినాదం

By telugu teamFirst Published Oct 17, 2019, 7:42 AM IST
Highlights

తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గమ్యాన్ని ముద్దాడే వరకు అనే నినాదం ఇస్తూ వచ్చారు. ఆ నినాదాన్ని ఇప్పుడు ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అశ్వత్థామ రెడ్డి ఆ నినాదం ఇస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇచ్చిన నినాదం ఇప్పుడు ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి నోట వినిపిస్తోంది. గమ్యాన్ని ముద్దాడే వరకు అంటూ కేసీఆర్ అప్పట్లో నినాదం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అదే నినాదాన్ని అశ్వత్థామ రెడ్డి ఇస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే గమ్యాన్ని ముద్దాడే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని కేసీఆర్ అప్పట్లో నినాదం ఇచ్చారు. గమ్యాన్ని ముద్దాడే వరకు సమ్మెను విరమించేది లేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. తాము చేస్తున్న సమ్మె పులిపై స్వారీ అనే విషయం తమకు తెలుసునని ఆయన అన్నారు. ప్రజా రవాణా సంస్థను బతికించుకునేందుకు, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం పాత్ర లేదని బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ తో మాట్లాడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. యూటీ (ఉద్యమ తెలంగాణ) నేతలతో మాత్రమే తాము మాట్లాడుతామని ఆయన చెప్పారు. 

ఉద్యమంలో వెన్నంటి నడిచిన కోదండరామ్ తో పాటు అనేక మంది నిజమైన ఉద్యమకారులకు కేసీఆర్ పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు. జీతభత్యాలనేవి తమ ఉద్యమంలో చిన్న విషయం మాత్రమేనని, సంస్థను బతికించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. 

హైదరాబాదు నగరంలో 6 వేల బస్సులు తిరగాలన 2005లో కమిటీ నివేదిక ఇచ్చిందని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇంకా పెరగాల్సి ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సుల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. హైదరాబాదులో నష్టాలను భరిస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని, తమకు బకాయిలు చెల్లిస్తే నష్టాలు ఉండవని అన్నారు. 

ప్రజా రవాణా అంటేనే సేవ చేయడమని, కానీ ఆర్టీసీపై భారీగా పన్నులు వేస్తూ ప్రభుత్వం ఆ ఉద్దేశ్యాన్ని దెబ్బ తీస్తోందని అన్నారు రూ.1500 కోట్లు ఆర్టీసీ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తోందని, ఆదాయమంతా పన్నులకే పోతే ఆర్టీసీ బతకడం కష్టం కాదా అని అన్నారు. ఆర్టీసీ కార్మికులు తెలివి తక్కువవాళ్లని సిఎం సీపీఆర్వో నరసింహా రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బస్ భవన్ వద్ద 9.5 ఎకరాలు, రేతిఫైల్ లో 10 ఎకరాలతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను మేఘా కృష్ణా రెడ్డికి అప్పగించారని ఆయన ఆరోపించారు. 

click me!