ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: భార్య ఉద్యోగం పోతోందని భర్త మృతి

By narsimha lodeFirst Published Oct 10, 2019, 7:17 AM IST
Highlights

సమ్మె ఆర్టీసీ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉద్యోగాలు ఉంటాయో పోతాయోననే ఆందోళన ఆ కుటుంబాల్లో ఉంది. తీవ్ర మనోవేదనకు గురైన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.


సంగారెడ్డి:ఆర్టీసీ సమ్మె కారణంగా తన భార్య ఉద్యోగం పోతోందనే భయంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. సంగారెడ్డి జిల్లాలోని  బాబానగర్ లో బుధవారం  నాడు తెల్లవారుజామున కర్నె కిశోర్ గుండెపోటుతో మృతి చెందాడు. కిషోర్ మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

కిషోర్ ప్రైవేట్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య నాగరాణి ఆర్టీసీలో పనిచేస్తోంది. ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు పలు డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే సమ్మెలో ఉన్న కార్మికులపై వేటు వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఆర్టీసీ సమ్మె సమయంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కిషోర్ భార్యతో పాటు కుటుంబసభ్యులతో చర్చించారు. తన భార్య ఉద్యోగం పోతోందని ఆయన ఆవేదన చెందినట్టుగా కుటుంబసభ్యులు గుర్తు చేసుకొన్నారు. ఇదే విషయమై రెండు రోజులుగా చర్చిస్తూ సరిగా భోజనం కూడ చేయలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

బుధవారం నాడు తెల్లవారుజామున కిషోర్ నిద్రలోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు. కిషోర్‌కు భార్య నాగరాణితో పాటు రెండేళ్ల పాప ఉంది.  కిషోర్‌ మృతి చెందిన విషయం తెలుసుకొని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త మృతికి ప్రభుత్వమే కారణమని నాగరాణి ఆరోపిస్తోంది. సీఎం  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే తన భర్తను భాదించాయని ఆమె గుర్తు చేసుకొన్నారు. 
 

click me!