ఆర్టీసీ సమ్మె : మద్దతు పలకనున్న ఇతర ఉద్యోగ సంఘాలు?

By telugu teamFirst Published Oct 9, 2019, 7:05 PM IST
Highlights

ఒకవేళ ఇప్పుడు అధికార తెరాస గనుక ఈ విషయంలో పైచేయి సాధిస్తే, మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులను కూడా ప్రభుత్వం ఇలానే ఇబ్బందులకు గురిచేయవచ్చని వారు భావిస్తున్నారు.ప్రభుత్వం గనుక విజయం సాధిస్తే, భవిష్యత్తులో ఇతర ఉద్యోగ సంఘాలను కూడా సమ్మెకు దిగకుండా ఇలానే బ్లాక్ మెయిల్ చేస్తుందని సదరు ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

హైదరాబాద్: తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, కార్మిక సంఘాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి.  

విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు. 

విధుల్లోకి రాకపోతే ఉద్యోగులను తొలగిస్తానని కెసిఆర్ అనగానే, ఊరికే బెదిరిస్తున్నాడని అనుకున్నారు తప్ప నిజంగా తీసేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అన్నట్టుగానే దాదాపు 48వేలమందిని విధుల్లోంచి తొలిగిస్తున్నట్టు కెసిఆర్ ఆదివారం రాత్రి తెలిపారు. 

ఈ విషయమై ఇందాక కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్మికుల తొలగింపుపై వెనక్కి తగ్గి కార్మికుల డిమాండ్లకు ఒప్పుకోకపోతే బంద్ కు పిలుపునిస్తామని సమావేశానికి హాజరయిన అన్ని పార్టీల నేతలు అల్టిమేటం ఇచ్చారు. నిన్నటిదాకా హుజూర్ నగర్ ఉపఎన్నికలో అధికార తెరాస కు మద్దతు పలుకుతామన్న సిపిఐ ఇప్పుడు పునరాలోచిస్తామని చెప్పడం ఒకింత కెసిఆర్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు. 

ఈ సమావేశానికి హాజరైన ఇతర ఉద్యోగ సంఘాల నేతలు తమ పూర్తి మద్దతును ఆర్టీసీ కార్మికులకు ప్రకటించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అధికార తెరాస గనుక ఈ విషయంలో పైచేయి సాధిస్తే, మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులను కూడా ప్రభుత్వం ఇలానే ఇబ్బందులకు గురిచేయవచ్చని వారు భావిస్తున్నారు.

ప్రభుత్వం గనుక విజయం సాధిస్తే, భవిష్యత్తులో ఇతర ఉద్యోగ సంఘాలను కూడా సమ్మెకు దిగకుండా ఇలానే బ్లాక్ మెయిల్ చేస్తుందని సదరు ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఈ విషయమై వీరంతా మరోమారు సమావేశమవనున్నట్టు సమాచారం. 

టీఎస్ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మిగతా ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే వుండబోతుందనే చర్చ ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిఎ (డియర్నెస్ అలవెన్స్) కోసం కూడా ఉద్యోగులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. 

కాబట్టి ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. కొన్ని శాఖలకు చెందిన ఉద్యోగులైతే పెన్ డౌన్ చేసి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు సిద్ధమవుతున్నారట. సకలజనుల సమ్మె కాలంలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఒక్కతాటిపైకి వచ్చినప్పుడే, అప్పటి ఉమ్మడి ప్రభుత్వ కొమ్ములు వంచగలగడం వీలయ్యిందని వారు గుర్తు చేస్తున్నారు. 

మొత్తానికి ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో ఇలా కార్మికుల అంశం తెరమీదకు రావడం కెసిఆర్ కు తలనొప్పిగా పరిణమించిందనడంలో నో డౌట్.

click me!