
తెలంగాణలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలుచోట్ల నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్‌లో స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని 10 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఫిట్‌నెస్ లేని పలు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇకపై నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇక, వేసవి సెలవుల అనంతరం నిన్నటి నుంచి 2022-23 తాజా విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభం అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లోని మహబూబియాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలకు తిరిగి వచ్చిన విద్యార్థులను అభినందించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారంతో మొత్తం 1.04 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఇక, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్ రెండు మాధ్యమాల్లోనూ ఉండేలా సిద్ధం చేశారు.