రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది . ప్రతి మండలంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విద్యారంగానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రతి మండలంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలేజీ స్థాయిలో ఉద్యోగానికి సమర్ధతను సమకూరుస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించినట్లు భట్టి పేర్కొన్నారు. అలాగే విద్యారంగానికి రూ.21,389 కోట్లు కేటాయించగా.. ఇందులో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు గాను మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించారు.
గురుకుల పాఠశాలలకు వసతులతో కూడిన సొంత భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామని.. అన్ని గురుకుల పాఠశాలల్లో సౌర విద్యుత్‌ను ప్రవేశపెడతామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1000 కోట్లు, ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250 కోట్లు, గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా 2 ఎంబీఏ కళాశాలలు తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
బీసీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1546 కోట్లు , అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయడమే మా లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు అందిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.