
ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ (bhoraj) హైవే ప్రమాదకరంగా మారింది. ఇక్కడ తరచుగా యాక్సిడెంట్ (accidents) లు జరుగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఇక్కడూ మూడు యాక్సిడెంట్ లు చోటు చేసుకున్నాయి. ప్రతీ ప్రమాదంలో ఒక్కరు చొప్పున మూడు రోజుల్లో ముగ్గురు చనిపోవడం శోఛనీయం. ముగ్గురు మృతుల్లో ఒకరు టీచర్ కాగా మరొకరు స్టూడెంట్. ఇంకొకరు ఓ గ్రామానికి పెద్ద మనిషి. ఒకే ప్రాంతంలో ఈ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
స్కూల్ కు వెళ్తుండగా..
జామిడి పద్మజా రెడ్డి (padmaja reddy) జైనథ్ మండలంలోని ఓ గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ (teacher)గా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి స్కూల్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో భోరజ్ వద్దకు చేరుకునే సరికి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త ప్రకాశ్ రెడ్డి కూడా గవర్నమెంట్ టీచరే. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది.
జ్వరం వస్తోందని స్కూల్ నుంచి వెళ్తుండగా..
ఆదిలాబాద్ జిల్లా బోరిగామ గ్రామానికి చెందిన ఆకిటీ వెంకట్ రెడ్డి కూతురు శైత్ర (shaitra) (13) జైనథ్ మండల పరిధిలోని పిప్పర్ వాడ ప్రాంతంలోని అభ్యుదయ పాఠశాలలో చదువుతోంది. పిప్పర్ వాడ ప్రాంతంలోనే హాస్టల్ ఉంటూ తరగతికి హాజరువుతోంది. ఈ క్రమంలో బాలికకు జ్వరం వచ్చింది. దీంతో ఆమెను హాస్పిటల్ లో చూపించేందుకు తండ్రి గురువారం స్కూల్ కు వచ్చాడు. పాపను తీసుకొని ఆదిలాబాద్ వైపు బైక్ పై ప్రయాణం మొదలు పెట్టారు. అయితే జైనథ్ మండలం భోరజ్ ప్రాంతానికి చేరుకన్న సమయంలో ఈ బైక్ ను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శైత్ర అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి వెంకట్ రెడ్డికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా..
జైనథ్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన వడ్డారపు రాజరెడ్డి పటేల్ బుధవారం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చారు. అక్కడ పనులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. భోరజ్ సమీపంలోకి చేరుకునే సరికి ఓ వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ గ్రామం మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది.
చెక్ పోస్ట్ వద్ద ఆందోళన..
వరుసగా మూడు రోజుల పాటు మూడు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో శుక్రవారం సాయంత్రం స్థానికులు భోరజ్ చెక్ పోస్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. చెక్ పోస్ట్ ఆఫీసులోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం హైవే రోడ్డుపై బైఠాయించారు. ఈ భోరజ్ ప్రాంతం తెలంగాణకు, మహారాష్ట్రకు బార్డర్ గా ఉంది. ఇక్కడ ప్రభుత్వం నేషనల్ హైవే నెంబర్ 44పై చెక్ పోస్ట్ కూడా నిర్వహిస్తుంది. అందుకని ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో పాటు మహారాష్ట్ర, ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు ఈ ప్రాంతమే కీలకంగా ఉంది. దీంతో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న హైవే ప్రాంతంలో నాలుగు వైపులా సర్వీసు రోడ్లు నిర్మించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.