ప్రత్యర్థులకు ఎసరు: రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ వ్యూహం ఇదీ....

Published : Aug 06, 2022, 09:58 AM IST
ప్రత్యర్థులకు ఎసరు: రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ వ్యూహం ఇదీ....

సారాంశం

తనతో విభేదిస్తూ తనతో సహరించని పార్టీ నేతలను వదిలించుకునే వ్యూహాన్ని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎసరు పెట్టారని అంటున్నారు.

హైదరాబాద్: పార్టీలోని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన వ్యూహమే అది. పార్టీలోని ప్రత్యర్థులకు, తనకు సహకరించని సీనియర్లకు ఆయన ఎసరు పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాను ఒక్కడే పార్టీని నడిపించాలని, తన చర్యలకు వ్యతిరేకత ఉండకూడదని ఆయన భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ను ఓ ప్రాంతీయ పార్టీ మాదిరిగా నడిపారు. అదే విధంగా తాను వ్యవహరించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లు భావించవచ్చు.

తన ఆలోచనకు భిన్నంగా వ్యవహరించేవారు పార్టీలో మౌనంగా ఉండాలని, లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆయన భావిస్తున్నట్లు అనుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో వ్యవహరించారని అనుకోవచ్చు. పార్టీని వీడుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన రెచ్చగొట్లారు. దీంతో ఆయన కూడా పార్టీని వీడే విధంగా కావాలనే రేవంత్ రెడ్డి మాట్లాడారని అంటున్నారు. రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ తో అమలు చేయడం ప్రారంభించారని అంటున్నారు. ఇది గమనించే బహుశా తనను కూడా పార్టీ నుంచి పంపించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ  పిసిసి అధ్యక్షుడిగా నియమితులు కావడం కొంత మంది సీనియర్లకు ఇష్టం లేదు. అలాంటివారంతా రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన జట్టును ఏర్పరుచుకోవడానికి రేవంత్ రెడ్డి అటువంటి సీనియర్లకు ఎసరు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా పార్టీని వీడారు. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డిని చేర్చుకోవడం ద్వారా తనకు ఎసరు పెట్టారని దాసోజు శ్రవణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎసరు పెట్టడానికి చెరుకు సుధాకర్ ను హడావిడిగా రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చకున్నట్లు సమాచారం. 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా సీనియర్ నేతలను కలిసి తనకు సహకరించాలని కోరారు. అయితే, వారు ఏ మాత్రం సహకరించడానికి సిద్ధంగా లేరని, తనకు అడ్డు పడడానికి ప్రయత్నిస్తున్నారని గమనించిన తర్వాత రేవంత్ రెడ్డి తన ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ప్రస్తుతం అమలులోకి తెచ్చినట్లు భావించవచ్చు. 

వి. హనుమంతరావు, జగ్గారెడ్డి వంటి నేతలు తొలి నుంచి కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. సర్దుబాటు చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో రేవంత్ రెడ్డి అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి మిగతావారిని పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్తున్నారు. నిజానికి, పార్టీ పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం ప్రారంభించారనే విమర్శలు ఉన్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేతల మధ్య సయోధ్య కొరవడడంతో చాలా రోజుల నుంచి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేసి మహేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డితో విభేదిస్తున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా మధుయాష్కిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వి హనుమంతరావు, జగ్గారెడ్డి మాత్రమే కాకుండా మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి వంటి నేతలు కూడా రేవంత్ రెడ్డితో విభేదించిన సందర్భాలున్నాయి. పార్టీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబులతో కూడా రేవంత్ రెడ్డి సఖ్యతను సాధించుకోలేకపోయారని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, విహెచ్ వంటి సీనియర్లను కూడా రేవంత్ రెడ్డి ఖాతరు చేయడం లేదని అంటున్నారు. 

కాంగ్రెస్ లోని రెండు ముఖ్యమైన కమిటీల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో వివాదాలు తలెత్తాయి. రేవంత్ రెడ్డి తీరును సీనియర్లు తప్పు పట్టారు. మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఎర్ర శేఖర్ లను పార్టీలో చేర్చుకునే విషయంలో ఆయా జిల్లాల నాయకత్వాలు రేవంత్ రెడ్డితో విభేదించాయి. దీంతో పార్టీలో ఎవరి చేర్చుకోవాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సీనియర్లతో కమిటీ వేయాలని అనుకున్నారు. 

ఈ కమిటీ నాయకత్వాన్ని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి జానారెడ్డికి ఆ నాయకత్వం దక్కేలా చూశారు. ఆ తర్వాత జానారెడ్డిని కూడా పట్టించుకోకుండా పార్టీలో నాయకులను చేర్చుకుంటూ వచ్చారనే విమర్శలున్నాయి. తెలంగాణ పిసిసి క్రమశిక్షణ సంగం చైర్మన్ గా తనకు అనుకూలమైన చిన్నారెడ్డి నియమితులయ్యే విధంగా చక్రం తిప్పారని అంటున్నారు. 

ఆ రకమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డికి సన్నిహితులైన నాయకులు ఉన్నారు. వారి ప్రాబల్యాన్ని పెంచడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ స్థితిలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చాలా మందికి నచ్చడం లేదు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?