ఎన్నికల ప్రధానాధికారి కూడా కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు: రేవంత్ రెడ్డి

By Arun Kumar PFirst Published Nov 15, 2018, 8:40 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రధనాధికారి రజత్‌కుమార్‌‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రజత్ కుమార్ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తూ నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదని అన్నారు. తాను రెండు సార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా రజత్ కుమార్ చర్యలు తీసుకోలేదని అందువల్లే ఆయనపై నమ్మకం పోయిందన్నారు. 

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రజత్ కుమార్ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తూ నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదని అన్నారు. తాను రెండు సార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా రజత్ కుమార్ చర్యలు తీసుకోలేదని అందువల్లే ఆయనపై నమ్మకం పోయిందన్నారు. 

కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అనవసరంగా వేధిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అనంతరం రేవంత్ ఈ ఫిర్యాదు గురించి మాట్లాడుతూ... రజత్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డిలు కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన వీరు తనకు సెక్యూరిటీని కల్పించలేదని గుర్తు చేశారు. తాను ఇప్పటికి మూడు సార్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని....ఈసారి పట్టించుకోకుంటే కోర్టు తలుపులు తట్టడమో, కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడమో చేస్తానని రేవంత్ హెచ్చరించారు. 

డిజిపి, కేసీఆర్ లు కలిసి కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించాడు. ఇంకా 19వ తేదీ వరకు నామినేషన్లకు సమయం ఉంది కాబట్టి దమ్ముంటే కేసీఆరే తనపై పోటీకి నిలబడాలని...అప్పుడు తాడో పేడో తేల్చుకుందామని రేవంత్ సవాల్ విసిరాడు. 

కోస్గి సీఐ శ్రీనివాస రావు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులకు బెదిరిస్తున్నాడని రేవంత్ పేర్కొన్నాడు. కారు గుర్తుకు సపోర్ట్ చేయాలని అతడు సూచిస్తున్నాడని లేదంటే బైండోవర్ కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని తెలిపాడు. మద్దూరు ఎస్సై నాగరాజు నిన్న రేణిభట్ల సభలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై అకారణంగా దాడికి పాల్పడ్డాడని....తమ కార్యకర్తల ఈపులు పగిలి, కాళ్లు విరిగి, రక్తం బైటికివచ్చిందన్నారు. ఈ విషయంపైనే ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా పిర్యాదు చేశామని రేవంత్ తెలిపాడు.  

  

click me!