ఆస్పత్రిలో విహెచ్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి: సలహాలిచ్చారని వెల్లడి

By telugu teamFirst Published Jun 28, 2021, 1:00 PM IST
Highlights

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత విహెచ్ ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి పరామర్శించారు. విహెచ్ తనకు సలహాలు, సూచనలు చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత వి. హనుమంతరావును ఆయన పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో విహెచ్ కిడ్నీ సమస్యకు చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య సమస్యలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి విహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. విహెచ్ ను పరామర్శించిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విహెచ్ తనకు కొన్ని సలహాలు, సూచనలు చేశారని, వాటిని తాను పాటిస్తానని ఆయన చెప్పారు. 

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తాను పార్టీని వీడుతానని, తనతో పాటు చాలా మంది పార్టీని వీడుతారని విహెచ్ గతంలో అన్నారు. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తే పార్టీ నాయకులంతా జైలు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెసును కూడా తుడిచిపెట్టేస్తారని ఆయన అన్నారు. 

ఇలావుంటే, రేవంత్ రెడ్డి సోమవారం విహె్చ్ ను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంతకు ముందు సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి కాంగ్రెసు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. రేవంత్ రెడ్డిని ఆయన శాలువాతో సత్కరించారు. ఆదివారంనాడు రేవంత్ రెడ్డి జానారెడ్డిని కూడా కలిశారు. 

click me!