
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే తాజాగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయని అన్నారు. క్లాస్ ఇమేజ్ ఉన్న నేతలనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 25 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి 7 నుంచి 8 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓటింగ్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని రేవంత్ రెడ్డి శనివారం తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే.. సొంత ఇంటికి 5 లక్షల సాయం, ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల ఉచిత వైద్యం, 2 లక్షల పంట రుణమాఫీ, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రూ. 500కే ఎల్‌పీజీ సిలిండర్‌ను కోల్పోవాల్సి వస్తుందన్నారు.
కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చారని.. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య.. వంటి అనేక వాగ్దాలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.