కేసీఆర్ ను వదలను...లెక్క మిత్తీతో సహా చెల్లిస్తా :రేవంత్ రెడ్డి

By rajesh yFirst Published Sep 17, 2018, 5:56 PM IST
Highlights

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తనను జైల్లో పెట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత మాజీఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనను చూసి టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని అందువల్లే జైళ్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తనను జైల్లో పెట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత మాజీఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనను చూసి టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని అందువల్లే జైళ్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కమిటీల్లో తనకు కీలక బాధ్యతలు అప్పగిస్తే టీఆర్ఎస్‌కు ఇబ్బంది ఎదురవుతుందని ముందే గ్రహించిన కేసీఆర్, ముందుగా అరెస్ట్ చేయించేందుకు కేంద్రంతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. 

తనను అరెస్ట్ చేయించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే తన చుట్టూ,తన బంధువుల చుట్టూ నిఘా పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావులే బాధ్యులని రేవంత్ పేర్కొన్నారు. కేంద్ర నిఘా సంస్థలతో రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతాయని బీజేపీ హామీ ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని రేవంత్ స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ కమిటీల ప్రకటనలకు ముందే తనపై కేసులు పెట్టి, అరెస్ట్ చేసే అవకాశముందన్నారు రేవంత్ రెడ్డి. ఈడీని పంపినా, వంద అక్రమ కేసులు పెట్టినా కేసీఆర్‌ను వదిలేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. లెక్క మిత్తీతో సహా చెల్లిస్తానన్నారు. తనపై పెట్టిన ఓటుకు నోటు కేసు తప్పుడు కేసు అని హైకోర్టు చెప్పిందన్నారు. టెలిఫోన్ సంబాషణలో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు స్పష్టం చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ లపై కేసులు పెట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు తనపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆఖరికి విమలక్క, హరగోపాల్, చుక్కా రామయ్య ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదన్నారు. ఇలాగే వ్యవహరిస్తే టీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. 

click me!