ఇంటర్ విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.. ఆ ఫీజులను మినహాయించాలి: రేవంత్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Jun 29, 2022, 12:47 PM IST
Highlights

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం విడుదలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు విడుదలైన తర్వాత మార్కలు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. 

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం విడుదలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు విడుదలైన తర్వాత మార్కలు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులు పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో  ఓ పోస్టు చేశారు. జీవితం విలువను అర్థం చేసుకోవాలని.. ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని విద్యార్థులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును మినహాయించాలని తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ డిమాండ్ చేశారు.

ఇక, తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులు ప్రాణాలు తీసుకుంటున్నారు . మార్కులు తక్కువ వచ్చాయని కొందరు... పాస్ అవ్వలేదని మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. హైదరాబాద్ చింతల్ బస్తీకి చెందిన ఇంటర్ విద్యార్ధి గౌతమ్ కుమార్ పాసయ్యాడు. కానీ మార్కులు అనుకున్న దానికంటే తక్కువ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ ఆవేదనతోనే ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు సైఫాబాద్ పోలీసులు.

 

It’s heart wrenching to see intermediate students resort to extreme measures after results.

I appeal to them to understand the value of life & not take any drastic steps.

I demand to waiver the fee for revaluation & supplementary examination.

— Revanth Reddy (@revanth_anumula)

మరోవైపు నగర శివార్లలోనే కాటేదాన్ లోనూ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్ధి బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం ఉదయం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67. 82 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టుగా చెప్పారు. ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో, హన్మకొండ సెకండ్ ప్లేస్‌లో నిలిచాయని వెల్లడించారు. ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టుగా చెప్పారు. ఆగస్టు ఒకటి నంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు  నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇస్తామని పేర్కొన్నారు. 

click me!