తెలుగు జాతి అంతా ఒకటేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటిగానే ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తన సంకల్పమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమీక్షలు, పోలవరం, రాజధాని అమరావతి లాంటి కీలక ప్రాజెక్టులపై శ్వేతపత్రాల విడుదలతో తీరిక లేకుండా గడపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు... ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ వెంటనే తెలంగాణకు విచ్చేసిన చంద్రబాబు.. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై పరిష్కరించారు.
అనంతరం ఆదివారం ఎన్టీఆర్ భవన్ సందర్శించిన చంద్రబాబు.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో పరోక్షంగా పనిచేసి విజయం కోసం కృషి చేసిన కేడర్ అందరికీ అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు సాగాయని వెల్లడించారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని... జగన్ పాలనలో అంతకు మించి నష్టపోయిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవకపోతే మరింత నష్టపోయేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెలుగుజాతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధిని అన్ని ప్రభుత్వాలు కొనసాగించడాన్ని అభినందించారు. దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణను ముందుంచారని కొనియాడారు.
undefined
తెలంగాణలో తెలుగుదేశం ఉంటుంది..
ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలెప్‌మెంటు కేసులో తనను అరెస్టు చేసినప్పుడు తెలుగువారు చూపించిన మద్దతు మరిచిపోలేనని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంతో పాటు విదేశాల్లోనూ తెలుగువారు తనకు మద్దతుగా రోడ్లపై రావడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను చేసిన అభివృద్ధి వల్ల తనను తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. తన అరెస్టు, ఎన్నికల సమయంలో అండగా నిలిచిన తెలంగాణ టీడీపీ కేడర్‌కు మనస్ఫూర్తిగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి అంతా ఒకటేనని... రెండు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటిగానే ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తన సంకల్పమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉండేవారని.... రాష్ట్ర విభజనతో ఆ సంఖ్య తగ్గిపోయిందన్నారు. అయినప్పటికీ సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లులాంటివని తెలిపారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ప్రకటించారు. చదువుకున్న వారికి, యువతకు పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు.
ప్రతిపక్షాలకు చురకలు...
అలాగే, విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తానే లేఖ రాశానని చంద్రబాబు తెలిపారు. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అభినందనలు తెలిపారు. తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలన్నదే తన అభిమతమని తెలిపారు. రెండు రాష్ట్రాలు వేరైనా, ఎవరి పాలన వారిదైనా, ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం, మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలని తెలిపారు. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొంత మంది కోరుకుంటున్నారని... వాళ్ల ధోరణి మారాలని చురకలంటించారు.