చావనైనా చస్తాను గానీ ఆత్మగౌరవాన్ని వదులుకోను: ఈటెల రాజేందర్

By telugu teamFirst Published May 3, 2021, 12:14 PM IST
Highlights

తెలంగాణ ఉద్యమం అభివృద్ధి కోసం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం కూడా జరిగిందని ఈటెల రాజేందర్ అన్నారు. తాను చావనైనా చస్తాను గానీ ఆత్మగౌరవాన్ని వదులుకోబోనని ఆయన చెప్పారు.

హైదరాబాద్: తాను చావుకైనా సిద్ధపడుతాను గానీ ఆత్మగౌరవాన్ని వదులుకోబోనని ఉద్వాసనకు గురైన మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు తెలంగాణ ఉద్యమం అభివృద్ధి కోసమే కాకుండా ఆత్మగౌరవం కోసం కూడా జరిగిందని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. ఎన్నిసార్లు మీ కలిసి బువ్వ తిన్నాను, ఎన్ని వేల కిలోమీటర్లు మీతో కలిసి నడిచాను, ఉద్యమ సమయంలో మీతో కలిసి నడిచానని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. 

పదవులూ డబ్బులూ ఎప్పుడూ ఉండవని, మానవ సంబంధాలు ఎల్ల కాలం ఉంటాయని గుర్తుంచుకోవాలని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. మీ కోసం తాను కొట్టాడిన సందర్భాలు మీకు గుర్తుకు రావాలని ఆయన అన్నారు. తనపై అసంతృప్తికి కేసీఆర్ కు వేరే కారణాలు ఉన్నాయని, చాలా జరిగాయని, అవన్నీ ఇప్పుడు చెప్పబోనని ఆయన అన్నారు. ఎన్ని దిగమింగానో మీకు తెలుసునని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. 

ఈ రోజు తన వెంట ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, తాను ఒంటరివాడినే కావచ్చు కానీ తన వెంట ప్రజలున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తాను ఒక్కడినే ఉన్నానని కేసీఆర్ చాలా సార్లు చెప్పారని, దాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. 

తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పట్టారని, ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చునని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ శిష్యరికంలో పనిచేసిన తాను ధర్మాన్ని చట్టాన్ని, ప్రజలను నమ్ముకున్నానని ఆయన అన్నారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు.

చట్టాన్ని, సిస్టమ్ ను పక్కన పెట్టి తనను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. వేల మంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఏడుస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, ఇతరేతర పనులు చేయవద్దని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు. 

ఉద్యమ కాలంలో కేసీఆర్ అణచివేతకు భయపడలేదని, ధర్మాన్నీ ప్రజలనూ నమ్ముకున్నారని, డబ్బును నమ్ముకోలేదని, అటువంటి ఉద్యమ నాయకుడు తనపై చట్టవ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

click me!