
హైదరాబాద్: ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం డబ్బులు చెల్లించిన దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు కోరితే ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వనున్నట్లు ఇటర్మీడియట్ బోర్డ్ (telangana intermediate board) ప్రకటించింది. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం 5గంటల నుండి జనవరి 17వ తేదీ వరకు దరఖాస్తులను రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
అయితే రీవాల్యుయేషన్ (intermediate re valuation), రీవెరిఫికేషన్ (inter re verification) కోరుకునే విద్యార్థులు దరఖాస్తును రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. దరఖాస్తు రద్దుకోసం అభ్యర్ధణ పెట్టుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 1నుండి తమ తమ కాలేజీల్లో నగదును వెనక్కి తీసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్ట్ సూచించింది.
ఇక ఇటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మార్కుల మొమోలను ఇంటర్ బోర్డ్ విడుదలచేసింది. ఇవాళ సాయంత్రం నుండి https://tsble.cgg.gov.in వెబ్‌సైట్ నుండి విద్యార్థులు తమ మొమోలను పొందవచ్చని ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను కూడా కనీస మార్కులు వేసి పాస్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంటే ఇటీవల ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు కేసీఆర్ సర్కార్ మెడకు చుట్టుకున్నాయి. గతేడాది ఇంటర్ విద్యార్థులు పరీక్షల కోసం సంసిద్దమైన సమయంలోను సెకండ్ వేవ్ రావడంతో పరీక్షలు వాయిదా వేసారు. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టగానే వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఇలా గందరగోళ పరిస్థితుల మధ్య విద్యార్థులు చదవలేకపోయి పరీక్షలో ఫెయిల్ అయ్యారు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసిన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కేవలం 49శాతం మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
మొత్తం 4,59,242 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తే కేవలం 2,24,012 మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మిగతా 51శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఇలా ఫెయిల్ అయిన విద్యార్థుల్లో చాలామంది మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వివాదం రాజుకుంది.
విద్యార్థుల ఆత్మహత్యలతో రంగంలోకి దిగిన ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టారు. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద బిజెపి, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
ఇలా ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరు పాస్ అయ్యారు. విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో కనీస మార్కులు వేసి పాస్ చేసింది ఇంటర్ బోర్డు. ఈ మార్కుల మెమోలనే ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది.