
గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడంగ్ పేట లోకాయుక్త కాలనీలో ఓ ఖాళీ స్థలం ఉంది. అక్కడి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. లోపలకు వెళ్లి పరిశీలించగా ఆ ప్రాంతంలో సుమారు 35 సంవత్సాల వయస్సు ఉండే ఓ మహిళ మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు జాగిలాన్ని, క్లూస్ టీంను ఘటనా స్థలానికి రప్పించారు. వారు వివరాలు సేకరించారు. అయితే ఆ మహిళను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడో ఈ దారుణానికి పాల్పడి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుకుంటున్నారు. ఇక్కడికి తీసుకొచ్చిన తరువాత కూడా ఆమె చనిపోలేదని భావించి ఓ బండరాయితో ఆమె తలపై కొట్టారని అర్థమవుతోంది.
ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మెడకు తాడుతో గాట్లు, అలాగే తలపై బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. పోలీసు జాగిలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ వరకు తిరిగింది. అయితే పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించారు. ఆ ప్రాంతంలోకి ఒక మహిళ, ఓ వ్యక్తి కలిసి వెళ్లినట్టుగా అందులో కనిపిస్తోంది. అయితే ఆ ఫుటేజి స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో పోలీసులు మరికొన్ని సీసీ కెమెరాలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.