సంచలనం: రాజకీయాల నుండి వైదొలుగుతున్నా: ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

First Published Jul 9, 2018, 10:31 AM IST
Highlights

టీఆర్ఎస్‌లో  వర్గ విబేధాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో  రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. మేయర్ తీరుపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాాదు చేసినా పట్టించుకోలేదని సోమారపు సత్యనారాయణ అసంతృప్తిగా ఉన్నారు.


రామగుండం: కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని  రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మెన్ సోమారపు సత్యనారాయణ  రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.

కొంతకాలంగా  రామగుండ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని  స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ  టీఆర్ఎస్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే పార్టీ నాయకత్వంపై ఆయనపై చర్యలు తీసుకోలేదు.

శనివారం నాడు  కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో  ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్గం మూడు స్థానాలను  మేయర్ వర్గం ఒక్క స్థానం, కాంగ్రెస్ పార్టీ ఓ స్థానాన్ని కైవసం చేసుకొంది.  

మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాస తీర్మాణం ప్రతిపాదించిన విషయంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ  కీలకంగా వ్యవహరించారని  ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నేతల మధ్య సమన్వయం చేసుకొంటూ వెళ్లాల్సిందిపోయి పార్టీలో గ్రూపులకు  ఆజ్యం పోస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం సోమారపు సత్యనారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పార్టీలో రెండు గ్రూపులను  మంత్రి కేటీఆర్ పిలిపించి మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. మేయర్‌పై తాను ఫిర్యాదు చేసినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని సోమారపు సత్యనారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో   రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 
 

click me!