వరంగల్ లో రహస్య పర్యటన: కొండా సురేఖ బయోపిక్ కు రామ్ గోపాల్ వర్మ ప్లాన్?

By telugu team  |  First Published Sep 23, 2021, 4:35 PM IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొండా దంపతుల బయోపిక్ తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన వరంగల్ రహస్య పర్యటన చేస్తున్నట్లు చెబుతున్నారు.


వరంగల్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరో బయోపిక్ తీయడానికి సిద్ధపడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొండా దంపతుల బయోపిక్ ను తీసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయన గురువారం వరంగల్ రహస్యంగా పర్యటించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి సంబంధించిన సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

కొండా దంపతులు చదువుకున్న కళాశాలకు వెళ్లి ఆయన వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ (RGV) కొండా దంపతులను కలుస్తారా, లేదా అనేది తెలియడం లేదు. బయోపిక్ తీసేందుకు వారు అనుమతిస్తారా, లేదా అనేది కూడా తెలియదు. ఆయితే, ఆర్డీవీ వారి అనుమతి అడుగుతారా, లేదా అనేది కూడా సందేహంగానే ఉంది. వరంగల్ జిల్లాలో రాజకీయంగా కొండా దంపతులు బలమైనవారు. 

Latest Videos

ప్రస్తుతం కొండా సురేఖ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెసు నాయకత్వం అడుగుతున్నట్లు సమాచారం. దానికి ఆమె షరతు పెడుతున్నారు. తమ కుటుంబానికి వరంగల్ లో టికెట్ ఇవ్వాలని ఆమె అడుగుతున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ఆమె జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెసులోకి వెళ్లారు. 

వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. శాసనసభ ఎన్నికల సమయంలో తాను అడిగిన నియోజకవర్గంలో తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో ఆమె టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని చెబుతున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరారు. 

ఇదిలావుంటే, బయోపిక్ లు తీయడంలో ఆర్జీవీ ముందు ఉంటున్నారు. ఆయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదాస్పదంగా మారింది. దాంతో ఆయన వివాదాస్పదమైన దర్శకుడిగా పేరు పొందారు. అంతకు ముందు రక్తచరిత్ర సినిమా తీసి తీవ్ర సంచలనం సృష్టించారు. ఇప్పుడు కొండా దంపతుల బయోపిక్ ను తీసేందుకు సిద్దపడినట్లు ప్రచారం సాగుతోంది. కొండా దంపతుల రాజకీయ జీవితంపై వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణవ్యాప్తంగా కథలు కథలుగా చెబుకుంటారు. 

click me!