మనసున్న మారాజు మా ఎస్పీ సారు...: రాహుల్ హెగ్డే ఆప్యాయతకు సిరిసిల్ల వృద్దురాలు సలాం

By Arun Kumar PFirst Published Jun 24, 2022, 11:09 AM IST
Highlights

 ఓ వృద్దురాలి బాధను దూరంచేసి ఆమె కళ్లలో ఆనందం  చూసేందుకు ఓ పోలీసులా కాకుండా మనసున్న మనిషిలా వ్యవహరించారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే. 

సిరిసిల్ల: పోలీసులంటే కఠినంగా వుంటారు... ప్రేమ, జాలి, దయ అనేవి వారికి వుండవని అందరూ భావిస్తుంటారు. జనాలను పీడిస్తారని, ప్రజలతో దురుసుగా వుంటారని, కేవలం రాజకీయ నాయకులకు, అధికార పార్టీలకు తొత్తులుగా వుంటారని పోలీసులపై అపవాదు వుంది. కానీ పోలీసులపై ప్రజలకు వున్న అభిప్రాయాన్ని మారుస్తూ ఖాకీల మనసు కఠినంగానే కాదు కరిగిపోయేంత సున్నితంగానూ వుంటుందని తెలంగాణకు చెందిన ఓ ఐపిఎస్ నిరూపించారు. అందరిలాగే పోలీసులకు కూడా ప్రేమాభిమానాలు, జాలి, దయ వుంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నిరూపించారు. 

వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రజలతో మమేకం అయ్యేలా 'పోలిస్ నేస్తం' అనే కార్యక్రమాలను రూపొందించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో మారుమూల గ్రామం తెనుగువారిపల్లె గ్రామాన్ని గతనెలలో ఎస్పీ రాహుల్ తన సిబ్బందితో కలిసి సందర్శించారు. 

గ్రామంలో శాంతిభద్రతలు, సమస్యల గురించి తెలుసుకునేందుకు ఎస్పీ రాహుల్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఓ వృద్దురాలు నడవలేని స్థితితో చేతికర్ర సాయంతో ఎస్పీ వద్దకు వచ్చింది. ఎంతో కష్టపడి చేయించుకున్న బంగారు గొలుసు ఇటీవల దొంగతనానికి గురయ్యిందని తెలిపింది. ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న తన మెడలోంచి గొలుసును ఎవరో దొంగిలించారని ఆ అవ్వ ఎంతో ఆవేదనతో ఎస్పీకి తెలిపింది. ఆమెను చూసి చలించిపోయిన ఎస్పీ తానే ఓ బంగారు గొలుసు చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. 

అయితే కేవలం వృద్దురాలిని అప్పటికప్పుడు ఓదార్చడానికి ఎస్పీ అలా చెప్పారని అందరూ భావించారు. ఈ కార్యక్రమం తర్వాత అందరూ ఎస్పీ హామీని మరిచిపోయారు. కానీ ఎలాగయినా ఆ వృద్దురాలికి బంగారు గొలుసు ఇచ్చి ఆమె ఆనందాన్ని చూడాలని రాహుల్ హెగ్డే నిర్ణయించుకన్నారు. ఈ క్రమంలోనే సొంత డబ్బులతో బంగారు గొలుసు చేయించారు. 

తాజాగా తెనుగువారిపల్లి సర్పంచ్ చంద్రారెడ్డి ద్వారా ముసలావిడను తన కార్యాలయానికి పిలిపించిన ఎస్పీ బంగారు గొలుసు బహూకరించారు. ఆ బంగారు గొలుసు చూసి ఆ అవ్వ ఆనందం అంతా ఇంతా కాదు. ఓ కొడుకులా మారి ఎస్పీ తనపై చూపించిన ప్రేమకి ఆ ముసలమ్మ ఆనందభాష్పాలు రాల్చింది. ఎస్పీకి దండంపెట్టి పోలీసులంతా చల్లగా వుండాలని దీవించింది. తనపై అమితమైన ప్రేమ కురిపించిన ఎస్పీ రాహుల్ హెగ్డేకు రుణపడి వుంటానని వృద్దురాలు తెలిపింది. 

click me!