ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి హైదరాబాదులోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి అత్యధిక స్థాయిలో వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. లింగంపల్లిలో అత్యధికంగా 4.0, చందానగర్లో 3.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక, చందానగర్, బాలానగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్, మాదాపూర్, ఖైరతాబాద్, బేగంపేట, కొండాపూర్, జీడిమెట్లతో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం కురియడంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
కాగా, బేగంపేట వాతావరణ శాఖ అధికారులు హైదరాబాదులో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య రుతుపవనాల కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
పదేళ్ల మీ హయాంలో బీసీలకు మిగిలింది వేదన.. అరణ్య రోదనే : ప్రధాని మోడీకి కేటీఆర్ కౌంటర్
ముఖ్యంగా బుధవారం నాడు సూర్యాపేట, నల్గొండ, మహబూబ్నగర్, నారాయణ్ పేట, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, కొత్తగూడెం, ములుగు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపారు.
మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 5.9 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చుండూరు మండలంలో ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది.