
తెలంగాణలో ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు, కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ వేదికగా ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. రాహుల్ చేయనున్న ప్రసంగంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పొరుగున ఉన్న తెలంగాణలో ఆ పార్టీకి ఊపు వచ్చింది. దీంతో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. దీంతో ఆ పార్టీ అధిష్టానం కూడా తెలంగాణలో వేగంగా పావులు కదుపుతుంది. ఖమ్మంలో జరిగే బహిరంగ సభతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనకు తెరపడుతుందని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం ర్యాలీతో కాంగ్రెస్ ఎన్నికలకు శంకరావం పూరిస్తుందని చెప్పారు. గతంలో ఖమ్మంలో అధికార బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభతో పోలిస్తే తమ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసులు, ఇతర శాఖలను ఉపయోగించి అప్రజాస్వామికంగా సభకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకుండా చూసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఇక, తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీజీ హాజరయ్యే సభను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం నగరంతోపాటు.. నగరానికి వచ్చే పలు మార్గాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. సభ వేదిక స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కనబడేలా 50అడుగుల ఎత్తున భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాల్‌ను తిప్పికొట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.
విజయవాడ మీదుగా రాహుల్..
ఖమ్మంలో జనగర్జన సభకు హాజరయ్యేందుకు వస్తున్న రాహుల్ గాంధీ.. ఢిల్లీ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంకు చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ సభావేదికపైకి వస్తారు. దాదాపు 1,360 కి.మీ పాదయాత్రను పూర్తిచేసిన భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ సన్మానించనున్నారు. అదే వేదికపై పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఆయన అనుచరులు, ఇతర నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు. ఇక, ఈ సభ అనంతరం రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.