
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఏప్రిల్ 28,29 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన సాగనునుంది. ఏప్రిల్ 28న వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజ్‌లో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. జిల్లా, మండల అధ్యక్షుల స్థాయి సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారని సమాచారం.
ఇక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రాహల్ గాంధీ కొద్ది రోజులుగా ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేతలు.. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వరి సేకరణ అంశాన్ని.. రాహుల్ గాంధీకి వివరించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ
ఈ సందర్భంగా పలు అంశాలపై రాహుల్ గాంధీ వారికి దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ విధానాలపైన పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో, ఆ పార్టీ విషయంలో మెతక వైఖరి అవలంభించడం తగదని అన్నారు. పార్టీ నేతల మధ్య ఐక్యత ముఖ్యమని.. అంతా కలిసి పనిచేయాలని సూచించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.
పార్టీ అంతర్గత విభేదాలపై మీడియా ముందు మాట్లావద్దని, ఏ సమస్య ఉన్నా తనకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చెప్పుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి తమ సమస్యలను వివరించారు.
ఇక, ధాన్యం కొనుగోళ్లపై ఏప్రిల్ నెలంతా ఉద్యమాలు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ చివరి వారంలో వరంగల్ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది. ఇటీవల తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.