హైదరాబాద్‌లో వరంగల్‌కు చెందిన నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ తెలంగాణను నాశనం చేసిందని ఆరోపించారు.
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 23 ఏళ్ల ప్రవళిక హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. వరుసగా పోటీ పరీక్షలు వాయిదా పడటం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవి నిర్వహిస్తుందా? మరింత జాప్యం చేస్తుందా? అనే నిర్వేదపూరిత ఆలోచనలు యువతను కుంగదీస్తున్నాయి. ఇదే తరుణంలో నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. అశోక్ నగర్‌కు పెద్ద మొత్తంలో యువత చేరుకుని నిరసన చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సంధించింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఇది ఆత్మహత్య కాదని, యువత కలలు, ఆశయాల హత్య అని పేర్కొన్నారు. బీజేపీ రిష్తేదార్ సమితి(బీఆర్ఎస్), బీజేపీలు రెండూ కలిసి గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు.
‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఒక్క నెలలోనే టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో పునర్వ్యవస్థీకరిస్తం. సంవత్సరం లోపే రెండు లక్షల ఖాళీలను ఉద్యోగులతో భర్తీ చేస్తాం. ఇది హామీ’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: ప్రవళిక ఆత్మహత్య.. ఆందోళనల్లో పాల్గొన్నవారిపై కేసులు..!
‘ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య. యువతీ, యువకుల కలల, ఆశయాల హత్య’ అని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ చేశారు. నిరుద్యోగంతో నేడు తెలంగాణ అల్లకల్లోలం అవుతున్నదని కామెంట్ చేశారు.