కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, మాజీ పీపీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరుతారని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, మాజీ పీపీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరుతారని కేటీఆర్ తెలిపారు. శనివారం పొన్నాల లక్ష్మయ్య ఇంటికి కేటీఆర్ వెళ్లారు. అనంతరం ఆయనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సూచన మేరకే పొన్నాల ఇంటికి వచ్చానని చెప్పారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. పొన్నాలకు బీఆర్ఎస్‌లో సముచితమైన స్థానం కల్పిస్తామని.. ఆదివారం కేసీఆర్‌ను పొన్నాల లక్ష్మయ్య కలుస్తారని కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత జనగామ టికెట్ ఇతర అంశాలపై క్లారిటీ వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
1960లలోనే పొన్నాల లక్ష్మయ్య అమెరికాలో ఇంజనీరింగ్ చదివి, నాసా లాంటి సంస్థల్లో పనిచేశారని కేటీఆర్ ప్రశ్నించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆహ్వానం మేరకు ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్‌లో చేరారని మంత్రి గుర్తుచేశారు. అయన వయసు, అపారమైన అనుభవానికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తూలనాడాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తీరును పార్టీలకి అతీతంగా ఖండిస్తున్నారని తెలిపారు. పీసీసీ చీఫ్ .. తొలుత బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడని దుయ్యబట్టారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్ రెడ్డి నీతులు మాట్లాడటమేంటని కేటీఆర్ చురకలంటించారు.
ALso Read: అవమానించారు, కాంగ్రెస్ కు రాజీనామా బాధగా ఉంది: కన్నీరు పెట్టుకున్న పొన్నాల
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను తీసుకెళ్లి పీసీసీ చీఫ్‌ను చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. డబ్బు సంచులకు కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారని మంత్రి ఆరోపించారు. చచ్చే ముందు పార్టీ మారడం ఏంటంటూ పొన్నాలను ఉద్దేశించి మాట్లాడినట్లుగా తనకు తెలిసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకపు సింహసనంపై శునకం అన్న విధంగా రేవంత్ తీరు వుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.