కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి విమానంలో మేడిగడ్డ బయలుదేరారు. ఆయనతో పాటు టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారు.
హైదరాబాద్ : గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలుదేరారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ అంబటిపల్లిలో మహిళలతో భేటీ కానున్నారు. కల్వకుర్తిలో నిన్న జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నాయని… కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి కట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటీ.. కూలిపోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ప్రియదర్శిని జూరాల, శ్రీరామ్ సాగర్. నాగార్జునసాగర్, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయని, ఇప్పటివరకు ఏ సమస్యా లేకుండా అవి పటిష్టంగా ఉన్నాయని, లక్షలాది ఎకరాలకు నీటిని అందిస్తూ సాగులోకి తీసుకువస్తున్నాయని తెలిపారు.
ఈ ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న ప్రజలకు ఆదాయం, పని సమకూరుతోందని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పుచేసి మరి ప్రాజెక్టులు కట్టిందని.. కానీ అవి చూస్తుండగానే కుంగిపోతున్నాయని, కొట్టుకుపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో బ్యారేజీ కూలిపోతుందని సీఎం కేసీఆర్ వెళ్లి పరిశీలించి, అక్కడే సమీక్ష జరపాలని తెలిపారు.