
కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ స్పష్టం చేశారు. వరంగల్‌లో జరుగుతున్న రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దోచుకున్న వ్యక్తులతో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఈ పొత్తుపై కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడినా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎంత పెద్దవారినైనా పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో పొత్తు కోరుకునే కాంగ్రెస్ నేతలు ఎవరైనా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవచ్చని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి నేతలు పార్టీకి అక్కర్లేదని.. ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాడిన వారికే టికెట్లు దక్కుతాయని.. మీరెంత పెద్దనేతైనా ప్రజల పక్షాన పోరాడకపోతే టికెట్ దక్కదని రాహుల్ హెచ్చరించారు.
తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రైతుల పోరాటమే కాదని.. తమ పోరాటం కూడా అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోడీ రైతు చట్టాలను తెచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం వుందని రాహుల్ ఆరోపించారు. తెలంగాణలో గెలవలేం కాబట్టి బీజేపీ.. రిమోట్ కంట్రోల్‌తో పాలిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారే ఉండాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంత దోచుకున్నా, ఈడీ లేదు, ఐటీ రాదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ విధానాలు విమర్శిస్తే సహించేది లేదని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
తెలంగాణ ఏ ఒక్కరి వల్లా రాలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒక్కరి కోసం తెలంగాణ ఏర్పడలేదన్నారు. తెలంగాణ వల్ల ఒకే ఒక కుటుంబం బాగుపడిందని.. ఈ వేదిక మీద భర్తల్ని పొగొట్టుకున్న రైతు కుటుంబాలు వున్నాయని రాహు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వేదనకు ఎవరు కారణమని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి బాధిత రైతులు రాష్ట్రమంతా వున్నారని రాహుల్ అన్నారు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని... యువతకు ఉద్యోగాలు రాలేదని చెప్పారు. తెలంగాణ కల సాకారం చేసుకోవడానికి మీరు రక్తాన్ని, కన్నీళ్లను చిందించారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీ కలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో పేరుకే ముఖ్యమంత్రని.. నిజానికి ఆయనొక రాజు అంటూ పరోక్షంగా కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదని.. రాష్ట్రంలో రాజరికం నడుస్తోందని రాహుల్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని రాహుల్ తెలిపారు. మీ ముఖ్యమంత్రి రైతుల బాధ వినడం లేదని ఆయన దుయ్యబట్టారు.
తెలంగాణ రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర అడుగుతున్నారని.. రుణమాఫీ చేయమని కోరుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇవి ఒట్టిమాటలు కావని, తెలంగాణ కలలు నెరవేర్చే మొదటి అడుగంటూ రాహుల్ పేర్కొన్నారు. రైతులకు 15 వేలు సాయం అందిస్తామని ఇప్పుడే డిక్లరేషన్‌లో చెప్పామని ఆయన స్పష్టం చేశారు. డిక్లరేషన్‌లో వున్న ప్రతీ దానికీ మాది హామీ అని రాహుల్ పేర్కొన్నారు. రైతులే తెలంగాణకు పునాది అన్న ఆయన.. తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న దొంగ ఎవరు అని ప్రశ్నించారు.