సనత్ నగర్ రోడ్ షోలో రాహుల్ గాంధీ, చంద్రబాబు

By Nagaraju TFirst Published Nov 28, 2018, 7:06 PM IST
Highlights

ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ కుటుంబం దోపిడీకి గురైందని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి ఎన్నికల రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. 

సనత్ నగర్: ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ కుటుంబం దోపిడీకి గురైందని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి ఎన్నికల రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. 

వీరితోపాటు ప్రజాఫ్రంట్ కన్వీనర్ టీజేఎస్ అధినేత కోదండరామ్, కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి, పలు నియోజకవర్గాల అభ్యర్థులు  పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అధికారంలో కూర్చోబెట్టిందన్నారు. తాము కూడా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రజలకు సేవ చేస్తుందని భావిస్తే అంతా రివర్స్ గా జరిగిందని ఆరోపించారు. 

తెలంగాణలో ప్రజాపాలన జరగలేదని కేసీఆర్ కుటుంబ పాలన జరిగిందన్నారు. ఒక నయా నవాబ్ లా కేసీఆర్ పాలిస్తున్నారని ఆ నవాబ్ పాలనను తిప్పికొట్టాలన్న ఉద్దేశంతోనే ప్రజాకూటమి ఏర్పడిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం చేసిందని రమణ మండిపడ్డారు. 

శ్రీకాంతాచారి లాంటి యువకులు ఆత్మబలిదానాల్లో ఏర్పడిన తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలను పట్టించుకోలేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెురుగుపడాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తించి ప్రజాకూటమిగా ఏర్పడ్డామన్నారు. 

కేసీఆర్ కుటుంబం దోపిడీలో తలసాని ఒక తొత్తు అని రమణ ఆరోపించారు. తలసాని లాంటి నాయకులు ప్రజాకూటమికి జీహూర్ అనాల్సిందేనన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ ను గెలిపించాలని కోరారు. 

తెలంగాణలో ప్రజాకూటమిని గెలిపిస్తే ఈ ప్రజాకూటమే త్వరలో జాతీయ కూటమిగా రూపాంతరం చెందుతుందన్నారు. జాతీయ కూటమికి నాయకత్వం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 
 

click me!